వైసీపీ బాయ్ కాట్...ఇలా అయితే ఎలా బాసూ ?
అయిదేళ్ళకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇదీ ప్రజలలో మార్పు, ఇదీ పెరిగిన మా బలమని నిరూపించుకోవాలంటే ఎన్నికల్లో పాల్గొంటేనే తెలిసేది అని అంటున్నారు.
By: Tupaki Desk | 14 Dec 2024 9:30 PM GMTవైసీపీ పుట్టాక ఏ ఎన్నికలోనూ పాల్గొనకుండా లేనే లేదు. నిజానికి రాజకీయ పార్టీకి ఎన్నికలే ప్రాణాధారం. మనిషికి ఆక్సిజన్ అన్నట్లుగా పార్టీలకు ఎన్నికల పోరు సరికొత్త ఇంధనం. పదవుల కోసమే రాజకీయం అంటే ప్రజా సేవకు పదవులు అవసరం అన్నది కూడా పాయింటే.
ఆ లెక్కన చూస్తే ఎవరైనా పార్టీ పెట్టారూ అంటే పోటీకి సిద్ధంగా ఉన్నట్లుగానే భావిస్తారు. అలాగే వారు కదన రంగంలో దూకుతారు. ఇక టీడీపీ అయితే ఏపీ రాజకీయాలలో అలుపెరగని పోరాటమే చేస్తూ వచ్చింది.అయితే 2021 లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో తొలి విడతను చూశాక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొనరాదని డిసైడ్ అయింది. అలా ఫస్ట్ టైం టీడీపీ హిస్టరీలో చేసిన బాయ్ కాట్ అది.
అయితే అదే టీడీపీ 2023లో జరిగిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వ్యూహాత్మకం. అది అసలు ఎవరూ ఊహించనిది. అలాగే కేవలం 19 ఎమ్మెల్యేలను పెట్టుకుని పోటీకి దిగిన టీడీపీ ఫుల్ మెజారిటీ ఉన్న వైసీపీని వెనక్కి నెట్టి ఎమ్మెల్సీ సీటుని గెలుచుకోవడం రీసౌండ్ ని ఇచ్చే బిగ్ విక్టరీ.
అదే కాదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఒక ప్రణాళిక ప్రకారం పోటీ చేసి 2023లో నాలుగు ఎమ్మెల్సీలను జనం మద్దతుతో గెలుచుకోవడం ద్వారా పొలిటికల్ గేర్ మార్చి స్పీడ్ ఒక్కసారిగా పెంచేసింది. ఇవన్నీ చూస్తే కనుక 2021లో టీడీపీ బాయ్ కాట్ అన్నది అంతా ఒక భారీ వ్యూహంలో భాగం అని చెప్పాల్సి ఉంది. అది కూడా ఒకే ఒక ఎలక్షన్ ని ఆ పార్టీ అలా వదిలేసింది.
ఇపుడు చూస్తే వైసీపీ ఎన్నికల బాయ్ కాట్ ని అలా కంటిన్యూ చేస్తోంది. వైసీపీ అధికారం కోల్పోయాక పట్టభద్రుల ఎన్నికలు వచ్చాయి. వాటిలో మొదట వైసీపీ పోటీ చేస్తుంది అని అనుకున్నారు. అభ్యర్థులు కూడా ఫలానా వారు అని ప్రచారం సాగింది. కట్ చేస్తే మేము పోటీ చేయడం లేదని చెప్పి వైసీపీ కొత్త రూట్ తీసుకుంది.
నిజంగా బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ జరగాలని అని వాదిస్తూ వచ్చిన వైసీపీకి ఈ ఎన్నికలు ఒక విధంగా కలసి వచ్చిన అవకాశమే. అయితే అధికార పార్టీ సజావుగా ఎన్నికలను జరగనివ్వదు అన్న కారణంతో వైసీపీ తప్పుకుంది.
కట్ చేస్తే రాజ్యసభకు మూడు సీట్లు ఉప ఎన్నికలు వచ్చాయి. వైసీపీ తన వంతుగా పోటీ అయినా పెట్టి కాస్తా టెన్షన్ పుట్టించవచ్చు. అయినా సరే ఆ చాన్స్ కూడా వదిలేసుకుంది. అదే గతంలో అయితే టీడీపీ తనకు బలం లేకపోయినా 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి పెట్టి మరీ ఎన్నికల దాకా కధను తెచ్చింది.
ఇక ఇపుడు చూస్తే ఏపీ వ్యాప్తంగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పూర్తిగా గ్రామీణ వాతావరణం ఎక్కువగా రైతులే ఓటర్లుగా ఉండే ఎన్నికలు ఇవి. గ్రామాలలో వైసీపీకి బాగా ఆదరణ ఉంటుందని అంటారు. దానికి తోడు రైతులకు ఆరు నెలల కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని చెబుతూ వైసీపీ ఆందోళనలు చేస్తోంది. సరిగ్గా ఈ టైం లో ఎన్నికలు అంటే అడ్వాంటేజ్ గా తీసుకుని పోటీ చేయాలి. కానీ ఈ ఎన్నికలూ బాయ్ కాట్ అనేసింది వైసీపీ.
ఈ లెక్కన చూస్తే అధికార కూటమి ఎన్నికలలో దూకుడు చేస్తుందని సరిగ్గా జరగనివ్వదని భావిస్తూ పోతీ అసలు వైసీపీ ఎపుడు పోటీకి దిగుతుంది అన్న చర్చ ఉంది. ఈ లెక్కన స్థానిక సంస్థలకు కూడా వైసీపీ బాయ్ కాట్ అంటుందా అన్నది కూడా ఉంది.
ఆ ఎన్నికలు 2026లో రాబోతున్నాయి. అధికారంలో కూటమి ప్రభుత్వమే ఉంటుంది. మరి వారు అక్కడ ఉండగా ఏ ఎన్నికా సజావుగా సాగదు అని నమ్మితే కనుక వైసీపీ దీనిని కూడా బాయ్ కాట్ చేయాల్సిందే. అలా చేస్తే అసలు వైసీపీ ఏ ఎన్నికల్లో పాల్గొంటుంది జనాల నాడి ఎలా పట్టుకుంది అన్నదే పెద్ద ప్రశ్న.
అయిదేళ్ళకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇదీ ప్రజలలో మార్పు, ఇదీ పెరిగిన మా బలమని నిరూపించుకోవాలంటే ఎన్నికల్లో పాల్గొంటేనే తెలిసేది అని అంటున్నారు. అలా కాకుండా బాయ్ కాట్ మంత్రాన్ని జపిస్తూ పోతే వైసీపీ గ్రాస్ రూట్ లో పుంజుకునేది ఎలా పార్టీ జనాలకు జోష్ వచ్చేది ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతే కాదు కూటమి పట్ల జనాలలో వ్యతిరేకత ఉందని బయటకు చాటేది కూడా అఫీషియల్ గా ఎలా అన్నదే పెద్ద ప్రశ్న. మరి చూడాలి వైసీపీ ఏ విధంగా ఆలోచిస్తుందో అన్నది.