వైసీపీకి మరో దెబ్బ.. సోషల్ సైనికులు దూరం - దుమారం.. !
వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేందుకు.. కార్యకర్తలు సైతం బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
By: Tupaki Desk | 18 Dec 2024 9:30 PM GMTప్రతిపక్ష వైసీపీకి మరో భారీ ఎదురు దెబ్బ తగులుతోంది. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాను యాక్టివేట్ చేయాలని అనుకున్న ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతినిధులు కరువయ్యారు. ఉన్నవారు కూడా.. కేసుల్లో ఇరుక్కోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత.. వైసీపీ అధినేత జగన్.. ప్రచారంపై దృష్టిపెట్టారు. వచ్చే నాలుగు సంవత్సరాలుకూడా.. సోషల్ మీడియా దుమ్ము రేపాలని పిలుపునిచ్చారు.
దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమావేశాలు కూడా పెట్టారు. అయితే.. దీనిపై నిర్దిష్ట దిశానిర్దేశం చేయక పోవడంతో వైసీపీ సోషల్ మీడియాలో వివాదాస్పద కంటెంట్ హల్చల్ చేసింది. ఫలితం.. వైసీపీ సోషల్ మీడియా వివాదాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే కూటమి సర్కారు కన్నెర్ర చేయడం వైసీపీ సోషల్ సైన్యంపై కేసులు పెట్టడం తెలిసిందే. అయితే.. ఇలా కేసుల్లో ఇరుక్కున్నవారు సీనియర్లు, ఉద్ధండులు కావడంగమనార్హం. వారంతా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు.
ఈ పరిణామాలపై వెంటనే స్పందించి సరిదిద్దాల్సిన జగన్ కూడా మౌనంగా ఉండిపోయారు. ఒకటి రెండు సందర్భాల్లో సోషల్ మీడియాపై కేసులు పెట్టడం.. అక్రమం అన్నారు. ఆ తర్వాత.. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తే.. పీడీ యాక్టు బనాయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, అక్కడితో సరిపుచ్చారు. కానీ, అసలు సోషల్ మీడియాకు బలమైన దిశానిర్దేశం లేకుండా పోయింది. అదేసమయంలో కేసుల్లో చిక్కుకున్నవారిని కాపాడుకునే ప్రయత్నంకూడా చేయలేదు.
దీంతో అంతిమంగా.. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేందుకు.. కార్యకర్తలు సైతం బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ కామెంట్ చేస్తే.. ఏకేసు వెంటాడుతుందోనన్న బెంగ వారిని వెంటాడుతోంది. అదేసమయంలోపోస్టుల విషయంలోనూ హడలి పోతున్నారు. ఒకరిద్దరు కీలక నాయకులు కూడా.. సోషల్ మీడియాను దాదాపు దూరంపెట్టారు. ఈ పరిణామాలు.. వైసీపీకి భారీ ఇబ్బందిగా పరిణమించాయనే అంటున్నారు పరిశీలకులు. జగన్ ఇప్పటికైనా స్పందించి.. సోషల్ మీడియాను సరిదిద్దాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.