Begin typing your search above and press return to search.

అన్నింటికీ చంద్ర‌బాబే.. వైసీపీ ప్ర‌చారం విక‌టిస్తే..!

ఒక ప్ర‌చారం చేయ‌డం ద్వారా త‌మ‌కు ఏదో ఒక ర‌కంగా మేలు జ‌రుగుతుంద‌ని పార్టీకి మేలు చేయాల‌ని, జ‌ర‌గాల‌ని పార్టీల అధినేత‌లు భావిస్తారు.

By:  Tupaki Desk   |   29 Oct 2024 10:30 PM GMT
అన్నింటికీ చంద్ర‌బాబే.. వైసీపీ ప్ర‌చారం విక‌టిస్తే..!
X

ఒక ప్ర‌చారం చేయ‌డం ద్వారా త‌మ‌కు ఏదో ఒక ర‌కంగా మేలు జ‌రుగుతుంద‌ని పార్టీకి మేలు చేయాల‌ని, జ‌ర‌గాల‌ని పార్టీల అధినేత‌లు భావిస్తారు. ఇది కామ‌నే. అయితే.. ప‌దే ప‌దే చేసే ప్ర‌చారం ఒక్కొక్క సారి యూట‌ర్న్ తీసుకుని.. పార్టీకి మేలు చేయ‌క‌పోగా.. కీడు చేసే ప్ర‌మాదం ఉంది. ఇప్పుడు వైసీపీ విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. రాష్ట్రంలో ఏం జ‌రిగినా.. చంద్ర‌బాబు చుట్టూనే వైసీపీ తిరుగుతోంది.

ముఖ్యంగా త‌మ‌కు ఏం జ‌రిగినా.. వైసీపీ వెంట‌నే చంద్ర‌బాబు వైపు వేళ్లు చూపిస్తోంది. కాంగ్రెస్ చీఫ్‌, జ‌గన్ సోద‌రి ష‌ర్మిల‌.. ఇటీవ‌ల ఆస్తుల వ్య‌వ‌హారాన్ని తెర‌మీదికి తెచ్చిన విష‌యం తెలిసిందే. నిజానికి ఇది వైఎస్ కుటుంబానికి చెందిన స‌మ‌స్య‌. అయిన‌ప్ప‌టికీ.. దీని వెనుక చంద్ర‌బాబు ఉన్నార‌న్న వాద‌న‌ను వైసీపీ తెర‌మీదికి తీసుకువ‌చ్చింది. చంద్ర‌బాబు స్క్రిప్టునే ఆమె చ‌దువుతున్నారంటూ.. వైసీపీ నాయ‌కు లు విమ‌ర్శ‌లు గుప్పించారు.

వాస్త‌వానికి ఇప్పుడే కాదు.. ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేర‌డం వెనుక కూడా.. చంద్ర‌బాబు ఉన్నార‌ని, ఆయ‌న వ్యూహం ప్ర‌కార‌మే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరార‌న్న వాద‌న‌ను అప్ప‌ట్లోనూ స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి వంటి వారు చెప్పుకొచ్చారు. ఇలా.. ప్రతి విష‌యాన్నీ చంద్ర‌బాబుకు ముడి పెట్ట‌డం ద్వారా.. వైసీపీ రాజ‌కీయ వ్యూహాల‌ను మారుస్తోంది. గ‌తంలోనూ త‌మ‌కు గిట్ట‌ని ఓ ప‌త్రికా అధినేత కుటుంబంలో చెల‌రేగిన చిచ్చును కూడా వైసీపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది.

అయితే.. అప్ప‌టికి.. ఇప్ప‌టికి, మాత్రం ప్ర‌జ‌లు ఏమేర‌కు వైసీపీ చెబుతున్న‌ది న‌మ్ముతున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. కొన్నాళ్ల వ‌ర‌కు ఇలాంటి ప్ర‌చారాలు ఫ‌ర్వాలేదు. కానీ, రానురాను ఇదే త‌ర‌హా ప్ర‌చారం చేస్తే.. మాత్రం విక‌టించే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే.. ఇంట్లో ఏం జ‌రిగినా.. చంద్ర‌బాబే, బ‌య‌ట ఏం చేసినా చంద్ర‌బాబే అంటే.. ప్ర‌జ‌లు కూడా పెద్ద‌గా ఈ విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. దీంతో ఇప్పుడు వైసీపీ అంత‌ర్మ‌థ‌నం చెందుతోంది. ఈ నేప‌థ్యంలో గేర్ మార్చే దిశ‌గా అడుగులు వేస్తుండడం గ‌మ‌నార్హం.