వైసీపీకి కాపు కాయలేం...వరుసగా షాకులు!
ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైసీపీ నుంచి కాపు నేతలే ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు దానికి కారణం వైసీపీలో అధినాయకత్వం వైఖరిలో ఇంకా మార్పు రాకపోవడం అని అంటున్నారు.
By: Tupaki Desk | 12 Dec 2024 8:30 AM GMTవైసీపీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ మనుగడ సాగించాలీ అంటే అన్ని కులాలు మతాల నుంచి మద్దతు అవసరం. అయ్తే వైసీపీ విషయంలో మొదట్లో ఎలా ఉన్నా 2024 ఎన్నికల తరువాత ప్రభావం చాలా గట్టిగానే పడుతోంది. మరీ ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా చూస్తే వైసీపీ ఎన్నడూ లేని విధంగా చిక్కులను ఎదుర్కొంటోంది.
వైసీపీలో 2012 నుంచి అన్ని వర్గాలు ఉండేవి. గట్టిగా చెప్పాలీ అంటే వైసీపీకి వైఎస్సార్ ని మెచ్చి నచ్చే వారంతా జై కొట్టారు. అలా సర్వామోదం లభించింది. ఇక వైసీపీ పార్టీని జగన్ 2011 మొదట్లో ప్రకటించినది కూడా కాపులకు అడ్డాగా ఉన్న గోదావరి జిల్లాలలో. ఆనాడు ఆయన కాకినాడ పర్యటనకు వచ్చారు.
ఆ సమయంలో ఆయనను చాలా మంది నేతలు కలిశారు. ఆ సందర్భంగా ఆయన తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తూ తొందరలో పార్టీ అంటూ అక్కడే ప్రకటించారు. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న అతి పెద్ద సామాజిక వర్గం కాపులే. కాకినాడ మాజీ ఎంపీ తోట గోపాల క్రిష్ణ అలాగే రాజమండ్రికి చెందిన జక్కంపూడి రామ్మోహన్ రావు వంటి బలమైన కాపు సామాజిక వర్గం నేతలు మొదటి నుంచి జగన్ తోనే ఉండేవారు.
ఇంకా కాస్తా ముందుకు వెళ్తే జగన్ వైఎస్సార్ సీఎం అయ్యాక కడప జిల్లా దాటి తొలిగా బయటకు వచ్చింది కాకినాడ ప్రాంతానికే. ఆనాడు ఆయనకు గోదావరి జిల్లాలలో జన నీరాజనం లభించింది. అలా జగన్ కొత్త పార్టీకు కాపులే నాడు పునాదిగా ఉంటూ వచ్చారు.
ఇక 2012లో జరిగిన ఉప ఎన్నికలు అయితేనేమి 2014లో జరిగిన సాధారణ ఎన్నికలు అయితేనేమి వైసీపీని అట్టిపెట్టుకుని బలమైన కాపు నాయకులు ఉంటూ వచ్చారు. 2018లో జగన్ గోదావరి జిల్లాల పాదయాత్ర జన సునామీలా జరిగింది అన్నది కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అలా జగన్ వెంట వైసీపీ వెంట కాపులు బలంగా నిలబడ్డారు.
ఇదంతా ఎందుకు అంటే ఏపీలో రాజకీయాలు మార్చాలంటే గోదావరి జిల్లాలే అతి ముఖ్య కారణం. అలాగే బలమైన కాపు సామాజిక వర్గం కూడా కారణం అని చెప్పడానికి. మరోవైపు చూస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులను బాగానే సమాదరించింది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ అన్న రాజకీయ వార్ లో వైసీపీ దూకుడుగా వ్యవహరించడంతోనే కాపుల స్టాండ్ మారింది అని అంటున్నారు.
పవన్ ని ఏమైనా అంటే తమనే అన్నట్లుగా కాపులు తీసుకున్నారు. దాంతోనే కాపులలో వైసీపీకి వ్యతిరేకత మొదలైంది అని అంటారు. ఇంకో వైపు చూస్తే వైసీపీ 2019 నుంచి 2024 మధ్యలో చేసిన అధికార రాజకీయంలో టీడీపీ తెలివిగా పవన్ ని ముందు పెడితే వైసీపీ ఆ ట్రాప్ లో చిక్కుకుందని కూడా అంటారు. అసలు పవన్ ని చంద్రబాబుని కలిపింది కూడా జగన్ తప్పుడు రాజకీయ వ్యూహాలే అని కూడా అంటారు.
ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత వైసీపీ నుంచి కాపు నేతలే ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు దానికి కారణం వైసీపీలో అధినాయకత్వం వైఖరిలో ఇంకా మార్పు రాకపోవడం అని అంటున్నారు. తనదైన పాత ఆలోచనలు మూస విధానాలతోనే జగన్ ఉన్నారని తన తప్పులను ఆయన తెలుసుకోలేకపోతున్నారు అని అంటున్నారు.
దాంతోనే కాపు నేతలే కాదు చాలా మంది విసిగి వైసీపీని వీడుతున్నారు అని అంటున్నారు. ఇక మరోవైపు చూస్తే ఏపీలో టీడీపీతో పాటు జనసేన కూడా బలమైన ఆల్టర్నేషన్ గా ఉంటోంది. కాపులకు తమకొక పార్టీ ఉన్నదన్న భావన ఏర్పడుతోంది. అందుకే వారు అంతా ఇపుడు కూటమి వైపు చూస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ హై కమాండ్ ఆలోచనల ఫలితంగా ఆ పార్టీ ఎత్తిగిల్లుతుందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయని అంటున్నారు.
దాంతోనే వైసీపీని వీడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.మరో వైపు చూస్తే వైసీపీలో వరసగా ఇటీవల కాలంలో రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆళ్ళ నాని కనిపిస్తారు. ఎన్నికల ముందే మరో కాపు నేత కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక పిఠాపురంలో ఇంకో కాపు నాయకుడు పెండెం దొరబాబు రాజీనామా చేస్తారు అని అంటున్నారు. భీమవరంలో 2019 ఎన్నికల్లో పవన్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ కూడా పార్టీని వీడుతారు అని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఉత్తరాంధ్ర జిల్లాలలో చూసుకుంటే విశాఖ జిల్లా భీమిలీకి 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేల్గా పనిచేసి మంత్రిగా కూడా మూడేళ్ళ పాటు పనిచేసిన అవంతి శ్రీనివాస్ తాజాగా రాజీనామా చేశారు. ఇక గోదావరి జిల్లాలో మరో ఇద్దరు మాజీ మంత్రులు ఒక డైనమిక్ యంగ్ మాజీ ఎమ్మెల్యే ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీని వీడుతారు అని ప్రచారం జోరుగా సాగుతోంది.
మొత్త మీద చూస్తే జగన్ తన పాత పంధాను వీడి పార్టీని వదిలి వెళ్తున్న వారి విషయంలో ఫోకస్ పెట్టాలని అంటున్నారు. లోపం ఎక్కడ ఉందో గమనించుకోవాలని చక్కదిద్దుకోవాలని అంటున్నారు. లేకపోతే ఇదే జోరు కొనసాగితే ఫ్యాన్ రెక్కలు సైతం కదలకుండా బ్రేకులు పడతాయా అన్న చర్చ అయితే సాగుతోంది.