జగన్ తిట్టడం ఓకే.. బాబును ఇరికిస్తున్నారే... !
ప్రస్తుతం జరుగుతున్న ఇసుక, మద్యం వ్యవహారాలను వైసీపీ సానుభూతి పరులు.. ఆధారాలతో సహా సోషల్ మీడియాకు ఎక్కించేస్తున్నారు.
By: Tupaki Desk | 6 Dec 2024 1:30 PMరాజకీయాల్లో ప్రత్యర్థులను టార్గెట్ చేయడం తప్పుకాదు. అసలు రాజకీయాల్లో చేయాల్సిందే అది ! కానీ, ఈ క్రమంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ.. తమ వారిని ఇరికించే ప్రయత్నంలో టీడీపీ నేతలు బిజీబిజీగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా సహా కొందరు అధికార ప్రతినిధులు చేస్తున్న రాజకీయం.. చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. వైసీపీ అధినేత తన పాలనలో అనేక అక్రమాలు చేశారని.. చెబుతున్న తమ్ముళ్లకు.. సోషల్ మీడియాలో అంతకన్నా ఎక్కువగా సెగ తగులుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న ఇసుక, మద్యం వ్యవహారాలను వైసీపీ సానుభూతి పరులు.. ఆధారాలతో సహా సోషల్ మీడియాకు ఎక్కించేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పలేక.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సైలెంట్ అవుతున్నారు. మీరు అక్రమాలు చేశారంటూ.. నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు రోజులుగా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ అధినేతపై నిప్పులు చెరుగుతున్నారు. కానీ, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంగతులను వైసీపీ సానుభూతిపరులు ఎత్తి చూపుతున్నారు.
ఇక, జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. ఫీజు రీయింబర్స్‌మెంటు చేయలేదని.. చివరి మూడు క్వార్టర్లు పెండింగులో పెట్టారని పేర్కొంటూ.. అనుకూల మీడియాలో గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. చంద్రబాబు పాలనలోనూ.. చివరి ఏడాది పెండింగులో పెట్టిన బకాయిలు ఇవీ.. అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చిట్టా పద్దులు పెడుతున్నారు. అంతేకాదు.. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు చివరి ఏడాది బకాయిలు మిగులుస్తాయని కూడా చెబుతున్నారు.
నిన్న మొన్నటి వరకు కేవలం మాటలకే పరిమితం అయిన.. వైసీపీ వర్సెస్ టీడీపీలు.. ఇప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియాలో మరింతగా రెచ్చిపోతున్నారు. గణాంకాలతో సహా.. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతు న్నారు. ఈ ప్రభావం.. ఆయా పార్టీలపై ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా నే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇరు పక్షాలు సంయమనం పాటించి.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.