Begin typing your search above and press return to search.

కామ్రేడ్స్ వైపు వైసీపీ ?

దాంతో జగన్ కి 2014 నుంచి 2019 దాకా జరిగిన ప్రతిపక్ష పాత్ర కాదు, ఆ హోదా లేదు, ఆ హవా లేదు అని తొందరలోనే అర్ధం అవుతోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 3:54 AM GMT
కామ్రేడ్స్ వైపు వైసీపీ ?
X

ఏపీలో దాదాపుగా ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీకి ఇపుడు అంతా ప్రతికూలతే కనిపిస్తోంది. ఏ ఒక్కరూ మొర ఆలకించని పరిస్థితి. దానికి తోడు బలమైన కూటమి ప్రభుత్వం ఉంది. ఏపీలో కేంద్రంలో వారిదే అధికారం. దాంతో జగన్ కి 2014 నుంచి 2019 దాకా జరిగిన ప్రతిపక్ష పాత్ర కాదు, ఆ హోదా లేదు, ఆ హవా లేదు అని తొందరలోనే అర్ధం అవుతోంది అని అంటున్నారు.

చిత్రమేంటి అంటే సొంత పార్టీ వారే నమ్మక పార్టీని వీడిపోతున్నారు. మరో వైపు అపర చాణక్యుడు చంద్రబాబు వేస్తున్న బాణాలు సంధిస్తున్న అస్త్రాలు తట్టుకోవడం కష్టసాధ్యమే అని అర్ధం అవుతోంది అంటున్నారు.

వైసీపీ ఓడి కేవలం మూడు నెలలు మాత్రమే అయింది. కానీ ఇంతలోనే వైసీపీ ప్రతిష్ట పాతాళానికి దిగజారేలా బాబు పదునైన వ్యూహాలతో కొట్టిన చోట కొట్టకుండా భారీగానే దెబ్బ కొడుతున్నారు అని అంటున్నారు.

చంద్రబాబు ఏ విధంగా చూసినా 2014 నాటి పాత సీఎం అయితే కాదు. అప్పట్లో ఆయన జగన్ ని లైట్ తీసుకున్నారు. కానీ 2019 ఓటమి తరువాత ఆ స్కోప్ అయితే అసలు ఇవ్వదలచుకోలేదు. జగన్ ని ఏ విధంగానూ రాజకీయంగా లేవనీయకూడదు అని ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.

దానికి అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నారు. సర్వ పాపాలను జగన్ కి అంటగడుతున్నారు. సమాజంలోని వివిధ సెక్షన్లలో వైసీపీ మీద సానుభూతి పోయే విధంగా చేస్తున్నారు. వివిధ రంగాలలో శ్వేత పత్రాల రిలీజ్ కూడా అందులో భాగమే. ఏపీని సర్వ నాశనం చేసిన భూతం జగన్ అంటున్నారు

ఆయన రాజకీయంగా ఉండకూడదు అని ఓపెన్ గానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంత కాలం ఒంటరి పోరాటం అని కూడా ఉంది. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్నది వైసీపీని షేక్ చేసి పారేసింది. దీని నుంచి బయటపడే మార్గం లేక ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

ఈ సమయంలో వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీలు ఏ ఒక్కటీ లేవు. అయితే కామ్రేడ్స్ మాత్రమే కొంత ఊరటను ఇచ్చేలా తీరుని కలిగిస్తున్నారు. సీపీఎం అయితే ఈ విషయంలో బాహాటంగానే కూటమి నేతల మీద ఫైర్ అవుతోంది. తప్పు జరిగితే విచారణ జరిపించాలని దీనిని వేరే విధంగా వాడుకోవడమేంటి అని కూడా అంటోంది.

లడ్డూల పేరుతో రాజకీయ సరికాదు అని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు అన్నారు. విజయవాడలోని ఏచూరి సీతారాం సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్తీ జరిగినట్లుగా రుజువు అయితే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ అంశాన్ని కులం మతం వంటి వాటికి ఆపాదించి లౌకిక తత్వాన్ని దెబ్బతీయరాదు అని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఆయన వ్యాఖ్యలు అయితే వైసీపీకి ఎంతో స్వాంతనను కలిగించాయి అని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీ నేతలు కూటముల సంగతి పక్కన పెట్టి ఏపీలో పోరాటాలు గట్టిగా చేయాలి అంటే కమ్యూనిస్టులతో కలసి ముందుకు పోవాలని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

గతం ఎలా ఉన్నా ఇపుడు వాస్తవాలు వైసీపీ అధినాయకత్వానికి అవగతం అవుతున్నాయని అంటున్నారు. అధినాయకుడు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం దాంతో పాటు కార్నర్ చేయడం ఇవన్నీ చూస్తూంటే ఏపీలో లౌకిక వాదం అనే దాని పెద్ద గొంతుకతో వినిపించే కామ్రేడ్స్ తో ఉంటేనే సేఫ్ అన్న మాట వైసీపీలో వినిపిస్తోంది.

మరి ఈ విషయంలో వైసీపీ హై కమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కామ్రేడ్స్ తో కలసి నడిస్తే మాత్రం వైసీపీ ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ పదునెక్కుతాయని అపుడే గట్టిగా ఏపీలో నిలబడగలరని అంటున్నారు. ఇక కామ్రేడ్స్ తో కలిస్తే ఫ్యూచర్ లో ఇండియా కూటమిలో కూడా చేరే అంశం ఆప్షన్ గా ఉంచుకోవచ్చు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుందో.