జగన్.. ఓటు బ్యాంకుకు వచ్చిన లాసెంత...!
ఈ నేపథ్యంలో నే వైసీపీకి బలమైన ఓటు బ్యాంకును దూరంగా చేయాలన్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం.
By: Tupaki Desk | 26 Sep 2024 9:30 AM GMTఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇదే సమయంలో పార్టీ దాదాపు 40 శాతం వరకు ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. ఇదీ.. అసలు సమస్య. అంటే.. సర్కారు ఏర్పాటుకు అవసరమైన ఓట్లలో కేవలం 8-10 శాతం తేడా మాత్రమే కనిపిస్తోంది. పైగా మూడు పార్టీలు కలిస్తేనే జగన్‌ను ఓడించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నే వైసీపీకి బలమైన ఓటు బ్యాంకును దూరంగా చేయాలన్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం.
దీనిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలంటే అంతే! ఎవరూ ఏం చేసినా రాజకీ యాల్లో తమ వ్యూహాలను సాధించేందుకే. అందుకే.. కూటమి సర్కారు తిరుపతి లడ్డూపై తీవ్ర ఆశలే పెట్టు కుంది. దీంతో జగన్ ఓటుబ్యాంకు కకావికలం అవుతుందని పెద్ద ఎత్తున భావించింది. నిజానికి ఈ వ్యవహారం వైసీపీలోనూ కలకలం రేపింది. తమ ఓటు బ్యాంకుకు ఇబ్బందేనని ఒకరిద్దరు నాయకులు ఆఫ్ దిరికార్డుగా మీడియాతోనూ వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి లడ్డూ దెబ్బకు జగన్ ఓటు బ్యాంకు ఎంత తగ్గిందన్నది చర్చగా మారింది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలన చేస్తే.. ఆది నుంచి కూడా.. జగన్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నది ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు. అలాగని హిందూ ఓటర్లు ఆయనకు దూరంగా ఉన్నారని కాదు. కానీ, సమయానికి, సందర్భానికి మధ్య ఉన్న గ్యాప్‌ను గుర్తించి హిందూ ఓటర్లు మారుతున్నారు. కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటు బ్యాంకు మాత్రం స్థిరంగా వైసీపీ వైపు నిలబడుతోంది.
2014, 2019 ఎన్నికల్లో ఇదే జరిగింది. అయితే.. ఈ సారి కూడా మైనారిటీ ఓటు బ్యాంకు వైసీపీకి పెద్దగా దూరం కాలేదు. ఎస్సీ, ఎస్టీలు కూడా ఆ పార్టీతోనే ఉన్నారు. తిరుపతి పార్లమెంటు సహా బద్వేలు వంటి ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడానికి ఇదే కారణం. కాబట్టి.. వీరు పెద్దగా లడ్డూ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం లేదు. ఇక, మైనారిటీలకు -తిరుపతి ప్రసాదానికీ సంబంధం లేదు. ఎటొచ్చీ హిందూ ఓటు బ్యాంకును తీసుకుంటే మాత్రం.. 3-5 శాతం ఓటు బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే.. అది కూడా శాస్త్రీయంగా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని సర్కారు నిరూపిస్తేనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు చూస్తే.. తొలి రోజుల్లో లడ్డూపై ఉన్న గందరగోళం.. తర్వాత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రాజకీయంగానే మిగిలింది. మున్ముందు ఈ వ్యవహారం తేలిపోతే.. అది జగన్‌కు పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చని అంటున్నారు.