నాలుగు నెలలలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ గ్రాఫ్ ?
ఇక ఆయన నమ్ముకున్న సంక్షేమమూ సోషల్ ఇంజనీరింగ్ అన్నీ కూడా ఘోర ఓటమినే అందించాయి.
By: Tupaki Desk | 30 Sep 2024 3:24 PM GMTఏపీలో వైసీపీ ఓటమి పాలు అయి నాలుగు నెలలు అయింది. వైసీపీ అయిదేళ్ల పాటు నిరాటంకంగా అధికారం చలాయించింది. జగన్ తనదైన శైలిలో పాలించారు. ఆయన సంక్షేమం పైన దృష్టి పెట్టి దానినే సర్వం అనుకున్నారు. ఇక జగన్ కోటరీ తోనే పాలన సాగించారు అన్న ప్రచారమూ సాగింది.
ఇక ఆయన నమ్ముకున్న సంక్షేమమూ సోషల్ ఇంజనీరింగ్ అన్నీ కూడా ఘోర ఓటమినే అందించాయి. ఏపీ ప్రజలు వెరీ స్మార్ట్ అని మరోమారు విలక్షణ తీర్పుతో నిరూపణ అయింది. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి అధ్బుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
నాలుగు నెలల పాలన పూర్తి అవుతోంది. ఒక విధంగా చెప్పాలి అంటే మొత్తం అరవై నెలల పాలనలో ఇది ఆరు శాతం కాలం అన్న మాట. పాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఇది టూ ఎర్లీ అని కూడా చెప్పాలి. కానీ అదే సమయంలో ప్రజలలో నానాటికీ పెరుగుతున్న ఆశలు ఆకాంక్షలు అన్నీ చూసుకున్నపుడు వారు ఈ నాలుగు నెలల పాలనలో సంతృప్తిగా ఉన్నారా అంటే మధ్యతరగతి ఎగువ తరగతి హ్యాపీస్ అని సర్వేలు చెబుతున్నాయి.
అదే సమయంలో దిగువ తరగతిలో మాత్రం అసంతృప్తి కొంత ఉందని అంటున్నారు. దానికి కారణం సంక్షేమ పధకాల అమలులో ఇంకా క్లారిటీ లేకపోవడమే. వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలల పాలనలో ఆ దిశగా అడుగులు ముందుకు వేయలేకపోయింది అన్న చర్చ ఉంది.
ఇంకో వైపు చూస్తే కనుక సూపర్ సిక్స్ హామీలలో సామాజిక పెన్షన్ అన్నది ఒక్కటి మాత్రమే అమలు అయింది. మిగిలినవి అన్నీ అలాగే ఉన్నాయి. దాంతో పాటు ప్రభుత్వం పనితీరు మీద కూడా చర్చ అయితే సాగుతోంది.
అయితే ప్రభుత్వం చెప్పుతున్న దానిని ప్రజలు నమ్ముతునే పరిస్థితి ఇంకా ఉంది. అప్పులు చేసి గత ప్రభుత్వం గద్దె దిగిపోయింది కాబట్టి కొత్త ప్రభుత్వం తంటాలు పడుతోందని అన్నీ సర్దుకుని ఏదో నాటికి తమకు అన్ని పధకాలు ఇస్తుంది అన్న ఆశ అయితే ప్రజలలో ఉంది అని అంటున్నారు.
ఇక వైసీపీ విపక్షంలో ఉంది. మరి విపక్ష వైసీపీకి జనంలో ఏ మేరకు గ్రాఫ్ పెరిగింది అన్నది చూస్తే కనుక ఏమీ లేదు అనే అంటున్నారు. టీడీపీ కూటమి మీద అసంతృప్తి ఉన్నా కూడా అది వైసీపీ మీదకు సంతృప్తిగా టర్న్ అయితే కావడం లేదు.
దానికి కారణాలు అనేకం. వైసీపీ అయిదేళ్ళ పాలన జనాలు చూసేసి ఉన్నారు. ఆ అనుభవాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. దాంతో వైసీపీని ఓడించి పంపిన తమ తీర్పుని వారు ఇప్పటికే సమర్ధించుకుంటూనే ఉన్నారు అని అంటున్నారు.
ఇక వైసీపీ అధినాయకత్వం వైపు నుంచి కూడా చూస్తే ఈ నాలుగు నెలలలో ప్రతిపక్షంగా పెద్దగా పెర్ఫార్మ్ చేసింది లేదు అని కూడా అంటున్నారు. దాంతో వైసీపీ ఓటని పాలు అయిన తరువాత జనాలలో పెద్దగా కనిపించడం లేదని కూడా అంటున్నారు.
ఈ రకమైన ప్రజాభిప్రాయం అయితే జనంలో ఉంది అని సర్వేలు చెబుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ప్రజల మద్దతుని పూర్తి స్థాయిలో పొందేందుకు ఇంకా సుదీర్ఘమైన సమయం ఉంది. హామీలు కూటమి పెద్దలు ఇచ్చారు. వాటిని నెరవేర్చడానికి టైం బాండ్ అంటూ లేదు కదా అన్నది కూడా ఉంది.అన్నీ సర్దుకుని చివరి రెండు ఏళ్ళలో అమలు చేసినా ప్రజల మద్దతు కూడగట్టుకోవచ్చు అన్న చర్చ ఉంది.
ఇక వైసీపీ విషయం తీసుకుంటే అధికార పార్టీకి కొంత టైం ఇచ్చిన తరువాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని చూస్తోంది అని అంటున్నారు. అలా కూటమి పట్ల వచ్చిన వ్యతిరేకత ఏమైనా ఉంటే దానిని సొమ్ము చేసుకునే పనిలో వైసీపీ రానున్న కాలంలో ఉండవచ్చు.
ఏది ఏమైనా జస్ట్ నాలుగు నెలలు మాత్రమే ఇప్పటికి అయ్యాయి. ఇంకా చాలా ఉంది. దాంతో ఏపీలో ఇది ఒక ప్రాధమికమైన ఒపీనియన్ గానే చూడాలని అంటున్నారు. రాజకీయం అంటే నిరంతరం పారే నది లాంటిది ఎపుడూ ఒకేలా ఉండదు సో రేపటి రోజున జనం ఏమి అనుకుంటున్నారు అనే కంటే ఎన్నికల వేళకు వారి అసలైన ఒపీనియన్ అన్నదే ముఖ్యమని కూడా విశ్లేషణలు ఉన్నాయి.'