మమత కూటమిలోకి వైసీపీ.. నిజమేనా ..!
కానీ, ఈ సారి మాత్రం వైసీపీ మౌనంగా ఉంది. దీనిని బట్టి ఇండియా కూటమిలో చేరడంపై వైసీపీ అంతర్గత చర్చల్లో ఉందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 13 Dec 2024 4:30 PM GMTకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న ఇండియాకూటమిలోకి వైసీపీ చేరుతుందన్న చర్చ మరోసారి తెరమీ దికి వచ్చింది. గత మూడు మాసాల్లో ఇలా ఇండియా కూటమిలోకి వైసీపీ చేరుతుందన్న వార్తలు రెండు సార్లు వచ్చాయి. అయితే.. రెండు సార్లు కూడా.. అవి తప్పని తేలిపోయింది. తాము కాంగ్రెస్ తో చేతులు కలపడం అసంభవమని వైసీపీ నాయకులు చెప్పారు. కానీ, ఈ సారి మాత్రం వైసీపీ మౌనంగా ఉంది. దీనిని బట్టి ఇండియా కూటమిలో చేరడంపై వైసీపీ అంతర్గత చర్చల్లో ఉందని తెలుస్తోంది.
ఎలా చేరతారు?
వైసీపీకి కాంగ్రెస్‌కు మధ్య రాజకీయ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తనను పట్టించుకోలేదన్న కారణంగా జగన్ కాంగ్రెస్‌కు రాం రాం చెప్పి.. కొత్త పార్టీ పెట్టుకుని కాంగ్రెస్‌కు కూసాలు కదిలించేశారు. దీనికి రాష్ట్ర విభజన కూడా తోడైంది. దీంతో కాంగ్రెస్ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. తర్వాత.. వైసీపీ అధికారంలోకి కూడా వచ్చింది. ఇక, ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడం.. కేంద్రంలోదన్నుగా ఉంటుందని భావించిన బీజేపీ రెండు పడవలపై కాళ్లు పెట్టడంతో జగన్ కూడా.. బీజేపీవిషయంలో విముఖతగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రంలో తమకు అండగా ఉండే పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమి వైపు ఆయన చూస్తున్నారన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ, కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా ఉంటే చేరేది లేదన్నది వైసీపీ చెబుతున్న మాట. ఇప్పుడు ఈ కూటమిలోనూ.. పగ్గాలు.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీసుకుంటారన్న చర్చ సాగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ అలా చేసేందుకు ఇష్టపడకపోయినా.. మమత తనకు మద్దతిచ్చే వారితో ప్రత్యేకంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ దిశగానే ఇప్పుడు వైసీపీ ఆలోచన చేస్తోంది. ఇండియా కూటమికి మమతా బెనర్జీ సారథ్యం వహిస్తే.. తాము చేరేందుకు ఇబ్బంది లేదని పార్టీ నుంచి సంకేతాలు అందినట్టు జాతీయ రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. ఒకవేళ ఇండియా కూటమి అందుకు సమ్మతించక.. మమత సొంతగానే కూటమిని ఏర్పాటు చేసినా.. దానిలో అయినా చేరేందుకు తమకు అభ్యంతరం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. మమత నేతృత్వం వహించే ఏ కూటమిలో అయినా.. వైసీపీ చేరనుంది. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో తమను బలపరిచేవారికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమేనన్నది వైసీపీ చెబుతున్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.