వైసీపీ కేడర్ ఆత్మహత్యలకు అసలు కారణం ఇదేనా?
మరికొంతమంది మాత్రం ఓటమికి ప్రధానకారణం అంటూ సీఎంవోపై విరుచుకుపడుతున్నారు.
By: Tupaki Desk | 8 Jun 2024 7:35 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన ఆ పార్టీ.. 2024కి వచ్చేసరికి 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి. దీంతో... ఇప్పుడు ఆ పార్టీ నేతలు పోస్ట్ మార్టం పనుల్లో ఉన్నారని అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఓటమికి ప్రధానకారణం అంటూ సీఎంవోపై విరుచుకుపడుతున్నారు.
ఇంకొంతమంది వాలంటీర్ వ్యవస్థపై ఫైర్ అవుతుంటే... మరికొంతమంది గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను లిస్ట్ అవుట్ చేస్తున్నారని సమాచారం. ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటినుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వీటికి కారణం మనస్థాపం కాదు బెట్టింగులని అంటున్నారు.
అవును... ఏపీలో వైసీపీ కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకాన్ని కేడర్ కల్పించినప్పటికీ ఓటర్లలో కల్పించలేకపోయారని అంటున్నారు పరిశీలకులు. ఆ పార్టీ అధినేత ఎప్పుడూ గ్రౌండ్ లెవెల్లో ప్రజల నాడిని పట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు. అయితే... ఐప్యాక్, ఆరా మస్థాన్ వంటి పలు సంస్థలు మాత్రం... ఏపీలో వైసీపీ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేశాయి.
దీంతో... ఇంత బలంగా చెబుతున్నారనే సరికి వైసీపీ కేడర్ బెట్టింగులు భారీగా కాసాయని అంటున్నారు. ఈ సర్వే సంస్థలతో పాటు వైసీపీ అధినేత జగన్ కూడా తమ పార్టీ గెలుపుపై పూర్తి ధీమాను కనబరిచారు. పైగా... ఎక్కడకు వెళ్లినా వైనాట్ 175 అనేవారు. దీంతో... పై 75 రాకపోయినా కనీసం 100 అయినా వస్తాయి కదా అనే భ్రమల్లో కేడర్ ఉండేవారని అంటుంటారు.
కట్ చేస్తే 11 స్థానాలకు పడిపోయిన పరిస్థితి. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి. ఈ సమయంలో పలువురు వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుస్తుంది. అయితే... అందుకు కారణం పార్టీ ఓడిపోయిందనో, జగన్ ఘోరంగా దెబ్బతిన్నారనో చెందుతున్న మనస్థాపం కాదని.. కేవలం పైన చెప్పుకున్న అందరి మాటలూ నమ్మి భారీగా బెట్టింగులు కాసి, ఆర్థికంగా చితికిపోవడమే అసలు కారణం అనే మాటలు వినిపిస్తున్నాయి.