Begin typing your search above and press return to search.

మూడ్ ఆఫ్ ఏపీ : పార్టీలకు పెరిగిన బీపీ !

అయితే పల్లె ఓటర్లలో ఒక రకమైన లక్ష్యం ఉందని పట్టణ ఓటర్లలో మరో రకమైన లక్ష్యం ఉందని ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   13 May 2024 3:27 PM GMT
మూడ్ ఆఫ్ ఏపీ : పార్టీలకు పెరిగిన బీపీ !
X

ఏపీలో బ్రహ్మాండమైన ఓటింగ్ జరిగింది. పల్లె పట్నం తేడా లేకుండా ఈసారి జనాలు విరగబడి ఓటేశారు. అయితే పల్లె ఓటర్లలో ఒక రకమైన లక్ష్యం ఉందని పట్టణ ఓటర్లలో మరో రకమైన లక్ష్యం ఉందని ప్రచారం సాగుతోంది.

ఇద్దరిదీ భవిష్యత్తుకి సంబంధించిన బెంగగానే చూస్తున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే భవిష్యత్తు అని ఒక సెక్షన్ అలాగే ప్రభుత్వం ఉంటేనే ఫ్యూచర్ అని మరో సెక్షన్ బలంగా బటన్ నొక్కిన నేపధ్యాన్ని స్థూలంగా అంతా చూస్తున్నారు. ఈ మధ్యలో ఇంకా చాలా రకాలైన కుల సమీకరణలు కూడా ఉన్నాయని చెప్పాలి.

ఏది ఎలా చూసుకున్నా ఏపీ ఓటర్ ఓటెత్తాడు. అది కూడా జోరుగానే. దాంతో ఈ పెరిగిన ఓటింగ్ తమకు లాభమా లేక నష్టమా అన్నదే అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ కూటమిలో చర్చోపచర్చగా సాగుతోంది. మరో వైపు చూస్తే ఏపీలో అధికార పక్షానికి వ్యతిరేకత అయితే పూర్తి స్థాయిలో లేదు. అలాగే కొన్ని విషయాలలో అనుకూలత ఉంది. అదే విధంగా విపక్ష కూటమికి అనుకూలత కొన్ని అంశాలలో ఉంది. ఇలా ఒక సంక్లిష్టమైన వాతావరణంలో జరిగిన ఎన్నికలుగా 2024 ఏపీ అసెంబ్లీ పోలింగ్ ని చూసి తీరాలని అంటున్నారు.

ఏపీలో రెండు ప్రభుత్వాలను జనాలు చూసి ఇస్తున్న అచ్చమైన స్వచ్చమైన తీర్పుగా కూడా దీనిని భావించాలి అని అంటున్నారు. అయిదేళ్ల జగన్ పాలన అలాగే విభజన ఏపీలో అయిదేళ్ళ చంద్రబాబు పాలన చూసారు. ఈ రోజున వారి మ్యానిఫేస్టో కంటే కూడా వారి పాలనలో వారు ఇచ్చే ప్రాధాన్యతలు వారికి వేటి మీద ఫోకస్ ఉంది. వేటి మీద లేదు అన్న అంశాలు ఈ పదేళ్ళలో జనాలకు క్షుణ్ణంగా తెలుసు.

ఇక తమకు ప్రభుత్వం నుంచి ఏమీ కావాలో బాగా తెలుసు. అలాగే ఎవరు అధికారంలో ఉంటే ఏపీ ప్రగతి గతిన సాగుతుంది అన్నది కూడా తెలుసు. ఇలా అన్ని రకాలుగా విశ్లేషించుకుని మరీ ఓటెత్తినట్లుగానే ఈ భారీ పోలింగ్ ని చూడాలి. అటు వైసీపీ ఇటు టీడీపీ అటు జగన్ ఇటు చంద్రబాబు ఈ ఇద్దరూ కూడా జనాలకు తెలిసిన వారు. వారి రాజకీయ జీవితం కూడా తెరచిన పుస్తకం.

వారి పాలన కూడా చూసి ఉన్నారు. ఇలా తీసుకుంటే కనుక జనాలకు జవాబు చెప్పడం చాలా సులువు. అలాగే తమదైన తీర్పు ఇవ్వడం కూడా సులువు. అదే సమయంలో ఈ ఇద్దరి విషయంలో కచ్చితమైన అభిప్రాయానికి రావడం కూడా కొంత ఇబ్బంది. ఇలా అనేక శషబిషలకు అవకాశం ఉన్న ఈ ఎన్నికలలో ఓటర్లు మాత్రం సామాజిక పరంగా ప్రాంతీయ పరంగా అలాగే అర్బన్ రూరల్ అన్న దాని పరంగా చీలిపోయారు అని స్పష్టంగా అర్ధం అవుతోంది.

దాంతో ఈసారి జరిగిన భారీ పోలింగ్ ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఎవరెన్ని విశ్లేషించినా ఓటర్ మాత్రం గుంభనంగా ఉన్నాడు. తన బటన్ తాను నొక్కేసి వెళ్ళిపోయాడు. ఆ ఓటు మాదే అంటే మాదే అని రెండు పార్టీలు అనుకోవచ్చు. కానీ ఎవరికి నిజంగా పడింది అన్నది మాత్రం జూన్ 4న తెలుస్తుంది. అంతవరకూ పార్టీలకు హై బీపీ తప్పదు అని అంటున్నారు.