ఆ టీడీపీ ఎంపీకి వైసీపీ నుంచి పోటీ ఎవరు?
ఉత్తరాంధ్రాను ఈసారి మళ్లీ కొల్లగొట్టాలని ఎక్కువ సీట్లు కైవశం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వైసీపీ చూస్తోంది.
By: Tupaki Desk | 24 Nov 2023 3:35 AM GMTఉత్తరాంధ్రాను ఈసారి మళ్లీ కొల్లగొట్టాలని ఎక్కువ సీట్లు కైవశం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వైసీపీ చూస్తోంది. అందుకే ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాజధాని అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ ప్రభంజనం బలంగా వీచిన 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రా జిల్లాలలో అయిదు ఎంపీ సీట్లలో నాలుగింటిని వైసీపీ గెలిచింది.
కానీ కొరకరాని కొయ్యగా శ్రీకాకుళం ఎంపీ సీటు ఉండిపోయింది. రాజకీయంగా పెద్దగా అనుభవం లేని కింజరాపు రామ్మోహననాయుడు వరసగా రెండవసారి గెలిచారు. ఆయన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు వారసుడిగా వచ్చినా తొలి అయిదేళ్లలో తన గురించి ప్రజలకు పరిచయం చేసుకున్నారు. ఇపుడు చూస్తే పదేళ్ల కాలంలో రాజకీయంగా రాటుదేలారు.
ఇపుడు తనకు ప్రత్యర్ధి ఎవరైనా హ్యాట్రిక్ కొట్టి తీరుతాను అని రామ్మోహన్ నాయుడు అంటున్నారు. వైసీపీ ఎవరిని నిలబెట్టినా తనకు పని లేదని ఎంతటి సీనియర్ అని నేను ఆలోచించనని కూడా అంటున్నారు. తాను చేసిన పనులు ప్రజలకు చేసిన మేలు ఇవే తనకు విజయాలుగా ఆయన చెబుతున్నారు.
ఈసారి తన విజయం ఖాయమని ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్మోహన్ నాయుడు మీద వైసీపీ నుంచి అభ్యర్ధి ఎవరు అన్న చర్చ అయితే సాగుతోంది. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. సిట్టింగ్ ఎంపీలు ఉన్న చోట మార్పు అయితే ఉండవచ్చు ఏమో కానీ అసలు రెండు సార్లు ఓడిన సీట్లో ముందు నుంచి అభ్యర్ధిని ఎంపిక చేసుకోకపోతే ఎలా అన్న చర్చ వస్తోంది.
పైఇగా శ్రీకాకుళం జిల్లా టీడీపీకి పట్టున్న ప్రాంతమని, అలాగే ఎంపీ సీటులో అనేక సార్లు టీడీపీ గెలిచిందని కూడా గుర్తు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 1996 నుంచి చూస్తే గత ముప్పయి ఏళ్ళలో ఒకే ఒకసారి కాంగ్రెస్ గెలిచింది అని అంటున్నారు. అంటే ఎటు నుంచి ఎలా చూసుకున్నా టీడీపీదే ఆ సీటు అని రుజువు అవుతున్న వేళ వైసీపీ అలెర్ట్ కాకపోతే ఎలా అన్న ప్రశ్నలు కూడా పుట్టుకుని వస్తున్నాయి.
అయితే వైసీపీకి మాత్రం సరైన అభ్యర్ధి ఎవరో తోచక ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు. ఎవరైతే రామ్మోహన్ నాయుడుని ఓడిస్తారో కూడా అర్ధం కావడంలేదు అని అంటున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుని అడిగితే ఆయన పోటీకి నో చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.
అలాగే శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ధర్మాన క్రిష్ణ దాస్ ని అడిగినా ఆయన నరసన్నపేట నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీకే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆముదాలవలస నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఎంపీగా తాను పోటీ చేయనని చెప్పేస్తున్నారుట.
వీళ్ళు ఎవరూ కారని కొత్త ముఖాల వెతుకులాటలో వైసీపీ ఉంది అని అంటున్నారు. డాక్టర్ దానేటి శ్రీధర్ ని పోటీకి పెట్టాలని చూస్తోంది. అయితే ఆయన రామ్మోహన్ కి సమ ఉజ్జీ అవుతారా అన్న డౌట్లు కూడా ఉన్నాయట. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అని అనుకున్నా ఆమె సైతం గెలుపు బాటను పార్టీని పట్టించగలరా అన్నది మరో సందేహంగా ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి సరైన అభ్యర్థి అయితే ఎంపీ సీటు కోసం దొరకడం లేదు అంటున్నారు. అదే టైం లో రామ్మోహన్ నాయుడు మాత్రం హ్యాట్రిక్ విజయం నాదే అంటున్నారు. మరి దీంతో వైసీపీ నేతలలో బీపీ పెరిగిపోతోందిట.