కులగణన లక్ష్యం ఏంటి.. వైసీపీ స్కెచ్ ఇదేనా..!
రాష్ట్రంలో వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కార్యక్రమం కుల గణన. దీనిని ఈ నెల 27 నుంచి ప్రారంభించనున్నట్టు ముందు ప్రకటించారు
By: Tupaki Desk | 18 Nov 2023 9:52 AM GMTరాష్ట్రంలో వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కార్యక్రమం కుల గణన. దీనిని ఈ నెల 27 నుంచి ప్రారంభించనున్నట్టు ముందు ప్రకటించారు. అయితే.. కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కులగణన అభిప్రాయ సేకరణ సదస్సులు జరుగుతున్నాయి. ఈ సదస్సులకు అన్నివర్గాకు చెందిన కుల సంఘాల నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఇక, ప్రతిపక్ష నాయకులకు కూడా ఆహ్వానాలు ఉన్నాయని చెబుతున్నా.. వారెవరూ రావడం లేదు.
ఇదిలావుంటే.. వైసీపీ నేతల మధ్య జరుగుతున్న చర్చ మేరకు.. అసలు కుల గణన లక్ష్యమేంటి? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల బిహార్‌లో చేపట్టిన కుల గణన మేరకు అక్కడ 65 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇక, ఇప్పుడు బిహార్ తర్వాత.. కుల గణన చేపట్టిన మూడో రాష్ట్రం ఏపీనే. రెండో రాష్ట్రం ఛత్తీస్‌గఢ్(కాంగ్రెస్ పాలిత రాష్ట్రం). అక్కడి మాదిరిగా ఇక్కడ కూడా 65 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రకటన ఏమైనా ఉందా? అనేది ప్రధాన చర్చ.
దీనికి కారణం.. వచ్చే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు కీలకంగా మారింది. ఇటీవల ముసాయిదా ఎన్నికల ప్రకటలోనూ బీసీ ఓటు బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా 8-12 లక్షల వరకు పెరిగింది. ఇది చాలా కీలకమైన ఓటు బ్యాంకు కావడంతో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని టీడీపీ కూడా చెబుతోంది. బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే కుల గణనకు తెరదీశారనేది ఈ పార్టీ వాదన.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. కార్యక్రమాలను సాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన వారికి అందించాలనే వ్యూహతోనే బీసీ గణనను చేపడుతున్నట్టు చెబుతున్నారు. కానీ, వాస్తవానికి ఎన్నికలకు ముందు చేపడుతున్న బీసీ గణన ద్వారా వైసీపీ చాలా పక్కా ప్లాన్‌తోనే ముందుకు సాగుతోందని అంటున్నారు పరిశీలకులు. తద్వారా బీసీలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కలను సాకారం చేసినట్టు అవుతుందని, ఇది ఎన్నికల సీజన్‌లోతమకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.