జగన్ నిర్ణయం: ఎన్నికలకు ముందే వైసీపీ సంబరాలు
సహజంగా ఎక్కడైనా ఏ పార్టీ అయినా.. గెలిచిన తర్వాత సంబరాలు చేసు కుంటుంది
By: Tupaki Desk | 28 Dec 2023 7:18 PM GMTఏపీ సీఎం జగన్ తన పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కు ముందే అన్ని నియోజకవర్గాలు, మండలాలు.. గ్రామీణ స్థాయిలో సంబరాలు చేయాలని సూచించారు. అదేంటి ? అనే డౌట్ వస్తుంది. సహజంగా ఎక్కడైనా ఏ పార్టీ అయినా.. గెలిచిన తర్వాత సంబరాలు చేసు కుంటుంది. విజయం దక్కించుకున్నాక విజయోత్సవాలు చేసుకుంటుంది. అయితే. దీనికి భిన్నంగా వైసీపీ ముందుగానే సంబరాలు చేసుకోవడం ఏంటనే ప్రశ్న వస్తుంది.
అయితే.. ఎన్నికలకు ముందే సంబరాలు అంటే.. ఇది ఎన్నికల గురించి కాదు.. మేనిఫెస్టో గురించి. 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యంగా మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల హామీ లను సంపూర్ణంగా నెరవేర్చామని వైసీపీ అదినేత చెబుతున్నారు. దీనిలో కీలకమైన.. సామాజిక పింఛన్ ను రూ.3000లకు పెంచడం ఒకటి. దీనిని జనవరి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో ఇక, 99 శాతం మేనిఫెస్టో అమలు పూర్తయినట్టే.
ఈ నేపథ్యంలో జనవరి 1 తర్వాత నుంచి నెల రోజుల పాటు.. అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రా మాల స్థాయిలో ఎమ్మెల్యేలు.. కొత్త, పాత ఇంచార్జ్‌లు కూడా పాల్గొని సంబరాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ``ఎన్నికలకు ముందు చేసుకునే సంబరాలు.. ఎన్నికల తర్వాత చేసుకునే సంబరాలకు నాంది పలికేలా ఉండాలని సీఎం జగన్ చెప్పారు`` అని కీలక సలహాదారు వెల్లడించారు.
సో.. దీనిని బట్టి.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను పూర్తిస్థాయిలో నెరవేర్చామన్న సంతోషంలో పార్టీ ఈ సంబరాలకు పిలుపునిచ్చింది. ఇలా.. దేశంలో ఎక్కడా ఏ పార్టీ కూడా.. మేనిఫెస్టోలో అంశాలు నెరవేర్చా మని, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చామని పేర్కొంటూ. సంబరాలు చేసిన పార్టీ అంటూ ఏదీ లేకపోవడం గమనార్హం. ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోంది. తలెత్తుకుని గర్వంగా ప్రజల మధ్యకు వెళ్లేలా చేసిందని కార్యకర్తలు సైతం అంటున్నారు.