సర్వేలకు అందని నిజం... వైసీపీ ధీమా అదే...!?
ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా తాము అధికారంలోకి మళ్లీ వస్తామని వైసీపీ అంటోంది.
By: Tupaki Desk | 9 Jan 2024 3:30 PM GMTఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా తాము అధికారంలోకి మళ్లీ వస్తామని వైసీపీ అంటోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా మరోసారి ఏపీలో జే గంట మోగించేది ఫ్యాన్ పార్టీయే అని అంటున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్ వాడీ కార్మికుల డిమాండ్ల మీద మాట్లాడుతూ మళ్లీ మేమే గెలిచేది, ఈసారి వారి కోరికలు అన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు.
అదే మాటను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా చెబుతూ వస్తున్నారు. గెలిచే పార్టీ మీదనే వత్తిళ్ళు ఉంటాయని అంటున్నారు. వైసీపీ గెలిచిన తరువాత అన్ని సమస్యాలకూ పరిష్కారం చూపుతామని కూడా అంటున్నారు
ఇంతకీ వైసీపీలో భారీ ఎత్తున మార్పు చేర్పుల తరువాత కూడా ఎందుకు ఉవ్వెత్తుల అసంతృప్తి జ్వాలలు రేగడం లేదు అన్నది కనుక తరచి ఆలోచిస్తే సంక్షేమ పధకాల విషయంలోనే వైసీపీకి బాగా మొగ్గు జనంలో ఉంది అని అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక గడచిన అయిదేళ్ల కాలంలో సగటున ప్రతీ కుటుంబానికి ఏదో ఒక పధకం రూపంలో గరిష్టంగా అయిదు లక్షల రూపాయల దాకా దక్కింది.
ఒకే ఇంట్లో సామాజిక పెన్షన్, అమ్మ ఒడి, అలాగే మహిళలకు ప్రత్యేక పధకాలు రైతులకు భరోసా డ్వాక్రా మహిళలకు పధకాలు ఇలా అన్నీ కలసి అయిదేళ్ళలో అయిదు లక్షల రూపాయలు రావడం అంటే మామూలు విషయం కాదని కూడా అంటున్న వారు ఉన్నారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో సంక్షేమ పథకాలు అన్ని పార్టీలు ఇచ్చాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో నిరాటకంగా ఇవ్వడం మాత్రం ఏపీలోనే సాధ్యపడింది అని మేధావులు ఒప్పుకుంటున్నారు.
అప్పు చేసి పధకాలకు ఇవ్వడం ద్వారా కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా పధకాలు ఆగలేదు అని వైసీపీ చెప్పుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ నేపధ్యంలో వైసీపీ సంక్షేమ పధకాలను అనుకున్న వారు బయటకు ఏమి మాట్లాడినా పోలింగ్ బూత్ లోకి వెళ్ళినపుడు మాత్రం వేసేది ఫ్యాన్ గుర్తుకే అని అంటున్నారు. ఆ సంఖ్య మొత్తం ఓటర్లలో అరవై నుంచి డెబ్బై శాతంగా ఉంది కాబట్టి వైసీపీ విజయానికి ఇక తిరుగులేదు అని భావిస్తున్నారు.
అదే సమయంలో తెలుగుదేశం కూడా ఎన్నికల హామీలను ప్రకటిస్తోంది. ఉచితాలను కూడా ముందుకు తెస్తోంది. తొలి మూడేళ్ళ పాటు ఏపీలో ఉచిత పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీసిందని ఏపీ శ్రీలంకగా మారుతుందని టీడీపీ గగ్గోలు పెట్టింది. కానీ ఇపుడు చూస్తే అదే పార్టీ రెట్టింపు పధకాలు అంటోంది. ఇక జనాల ముందు రెండేళ్ల క్రితం టీడీపీ ఉచిత పధకాల మీద మాట్లాడిన వ్యతిరేక మాటలూ ఉన్నాయి.
అలాగే 2014 నుంచి 2019 మధ్యలో ఇచ్చిన వందల హామీలను నెరవేర్చని ట్రాక్ రికార్డు కూడా ఉందని అంటున్నారు. దాంతో టీడీపీకి ఓటేస్తే మొత్తం పధకాలు రద్దు అవుతాయని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం కూడా వారిలో ఆలోచనలు కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో టీడీపీ వైసీపీలలో ఏదో ఒక పార్టీని ఎంచుకోవాలని చూసినపుడు మాత్రం జనాల ఓటు కచ్చితంగా వైసీపీ వైపు టర్న్ అవుతుందని ఆ పార్టీ ధీమాగా ఉంది.
డే వన్ నుంచి పధకాలను అమలు చేయడం వెనక జగన్ వ్యూహం ఇదే అంటున్నారు. ఎన్నికల ముందు పధకాలను అమలు చేసి కొద్ది నెలలకే పరిమితం చేస్తే జనాలు ఎటూ నమ్మరని వైసీపీ అధినాయకత్వం ఆలోచించిన మీదటనే మొదటి రోజు నుంచే పధకాలను అమలు చేస్తూ వెళ్లారు. ఇపుడు అదే వైసీపీకి వరం అవుతుందని భావిస్తున్నారు.
మొత్తానికి చూస్తే కనుక ఏపీలో అప్పులు ఎన్ని ఉన్నాయన్నది పక్కన పెడితే అప్పు చేసి కూడా పధకాలు అమలు చేసి విశ్వసనీయతను పెంచుకోవడం వలన వైసీపీ ఓటు పదిలంగా ఉండడమే కాదు, కొత్త ఓటర్లు కూడా తయారు అయ్యారు అన్నది ఆ పార్టీ ధీమాగా ఉంది. అందుకే ఎన్ని పార్టీలు కలసినా తమ పాజిటివ్ ఓటింగ్ ని చీల్చలేవని వైసీపీ నమ్ముతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.