ఎన్నికల సంఘంతో అమీతుమీ.. కోర్టుకెక్కిన వైసీపీ!
తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, విద్యా దీవెన కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మోకాలడ్డింది.
By: Tupaki Desk | 7 May 2024 4:45 PM GMTకేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో అంతర్మథనం చెందుతున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఇక, న్యాయ పోరాటానికి దిగింది. తెలంగాణలో ఒక విధంగా ఏపీలో మరో విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందన్నది వైసీపీ నేతల మాట. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తామని.. కొత్త పథకాలు.. కొత్తవారికి సంక్షేమం ఇవ్వబోమని చెప్పినా.. కేంద్ర ఎన్నికల సంఘం వినిపించుకోవడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, విద్యా దీవెన కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మోకాలడ్డింది.
ఆయా పథకాలను అమలు చేసేందుకు వీల్లేదని.. ఏదైనా ఉంటే.. జూన్ 4 తర్వాత కానీ.. మే 14 నుంచి కానీ చూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈ పరిణామంతో ఏపీ ప్రభుత్వం అంతర్మథనంలో పడిపోయింది. కీలక ఎన్నికల సమయంలో ప్రజలకు అందాల్సిన పథకాలు అందకపోతే.. అది ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు సార్లు ఆయా పథకాల విధివిధానాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసింది. అయినప్పటికీ.. కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. పైగా.. ఆ విధివిధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
ఇవన్నీ అయ్యేలోగా ఎన్నికలు వచ్చేసే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంతో అమీతుమీ తేల్చుకు నేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం.. అత్యవసరంగా విచారించాలంటూ.. ఓ పిటిషన్‌ను వేసింది. తెలంగాణలో రైతు బంధు పథకాన్ని అమలు చేసేందుకు అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం కొనసాగుతున్న పథకాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఇవి కొత్త పథకాలు కావని, ఇప్పటికే అమల్లో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియ ముగిశాకే నిధులు విడుదల చేసుకోవాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తెలిపింది.
ఇది ఎన్నికల సంఘం పక్షపాత వైఖరికి నిదర్శనమని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఉద్దేశ పూర్వకంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడమేనని తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు.. మరోసారి ఎన్నికల సంఘానికి విన్నవించాలని సూచించింది. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది.. ప్రభుత్వం మరోసారి ఆయా పథకాలపై వినతులు సమర్పిస్తే.. పరిశీలిస్తామని చెప్పారు. దీనికి సర్కారు కూడా అంగీకరించింది. దీంతో తక్షణం ఏదో ఒకటి చేయాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.