Begin typing your search above and press return to search.

వైసీపీలో కొత్త ముఖాలు తెర పైకి...!?

వైసీపీలో కొత్త ముఖాలు తెర పైకి వచ్చే సమయం ఆసన్నం అయింది. పాతవారికి టికెట్ ఇస్తే జనాదరణ అంతగా ఉండదు అని భావించిన అధినాయకత్వం సర్వేల ఆధారంగా వారిని పక్కన పెడుతోంది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 3:46 AM GMT
వైసీపీలో కొత్త ముఖాలు తెర పైకి...!?
X

వైసీపీలో కొత్త ముఖాలు తెర పైకి వచ్చే సమయం ఆసన్నం అయింది. పాతవారికి టికెట్ ఇస్తే జనాదరణ అంతగా ఉండదు అని భావించిన అధినాయకత్వం సర్వేల ఆధారంగా వారిని పక్కన పెడుతోంది. ఇప్పటికే పదకొండు మందిని మార్చిన హై కమాండ్ మరో నలభై మంది దాకా ఇలాగే మార్పులు చేర్పులు పెద్ద స్థాయిలో చేయవచ్చు అని అంటున్నారు.

విశాఖ జిల్లాలో పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ప్లేస్ లోకి ఒక కొత్త ముఖాన్ని తెస్తున్నారు అని తెలుస్తోంది. మాజీ జెడ్పీటీసి కంచిపాటి విశ్వనాధం పేరు అలా గట్టిగా వినిపిస్తొంది. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్నారు. ఆయన ఇటీవల అధినాయకత్వాన్ని కలిసి వచ్చారని అంటున్నారు.

ఆయనకే టికెట్ దక్కుతుందని అంటున్నారు. దాంతో ఆయన నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు పెందుర్తి అసెంబ్లీ సీటులో కాపులు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఈసారి ఆ కార్డుతో ముందుకు రావాలని వైసీపీ చూస్తోంది. అదీప్ రాజ్ ని పక్కన పెట్టడం వెనక ఆయన పనితీరుపై పెద్దగా సానుకూల స్పందన రావడంలేదు అని అంటున్నారు.

ఇక అనకాపల్లి అసెంబ్లీ సీటుకి ఎంపీ సత్యవతి పేరుని పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఆమె బలమైన గవర సామాజికవర్గానికి చెందిన వారుగా ఉన్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమరనాధ్ ని గాజువాక నుంచి పోటీ చేయించే ఆలోచన హై కమాండ్ కి ఉంది అని తెలుస్తోంది. ప్రస్తుతానికి వేరే వారికి బాధ్యతలు అప్పగించినా గాజువాక నుంచి గుడివాడ పోటీ చేయడం ఖాయమని వినిపిస్తోంది.

అలాగే విశాఖ నార్త్ నుంచి ఇంచార్జిగా ఉన్న కేకే రాజు జనంలో ఉన్నా అనుకున్న స్పందన అయితే పార్టీకి రావడంలేదు అని టాక్ నడుస్తోంది. పైగా సామాజిక సమీకరణలు కూడా వైసీపీ పరిశీలిస్తోంది అని అంటున్నారు. ఉత్తరం నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్నారు. దాంతో అదే సామాజికవర్గానికి చెందిన కీలక నేతకు బాధ్యతలు అప్పగిస్తారు అని తెలుస్తోంది. అలా అయితేనే ఉత్తర నియోజకవర్గం కైవశం చేసుకుంటామని వైసీపీ భావిస్తోంది.

భీమిలీలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుని విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. లేదా ఆయనను విశాఖ ఉత్తరం నుంచి అయినా పోటీ చేయించవచ్చు అని కూడా వినిపిస్తోంది. భీమిలీలో మాత్రం కొత్త ముఖానికే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. ఈసారి బీసీ సామాజికవర్గానికి పెద్ద పీట వేసేలా క్యాండిడేట్ ఉంటారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే విశాఖ జిల్లాలో కీలక నియోజకవర్గాలలో మార్పుచేర్పులు భారీ ఎత్తున ఉంటాయని అంటున్నారు.