Begin typing your search above and press return to search.

వైసీపీకి సినీ గ్లామర్ ఏదీ...?

అలా సినీ రంగం నుంచి మద్దతు వైసీపీకి పెరుగుతోంది అనుకున్న దశలో మళ్లీ గ్యాప్ అయితే ఏర్పడింది

By:  Tupaki Desk   |   9 Aug 2023 3:59 AM GMT
వైసీపీకి సినీ గ్లామర్ ఏదీ...?
X

వైసీపీ పుట్టి పన్నెండు ఏళ్ళు అయింది. అధికారం చేపట్టి నాలుగేళ్ళు పై దాటుతోంది. అన్ని వర్గాలను వైసీపీ ఎంత వరకూ దగ్గరకు తీసుకుందో తెలియదు కానీ సినీ వర్గం మాత్రం కాస్తా దూరంగానే ఉంది అని అనేక పరిణామాలు తెలియచేస్తున్నాయి. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని చెప్పినట్లుగా హైదరాబాద్ సినీ పరిశ్రమకు ఏపీ సచివాలయానికి చాలా దూరం ఉందనే అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ పుట్టిందే సినీ గ్లామర్ తో. అప్పటికి వెండి తర అగ్ర నటుడిగా ఉన్న ఎన్టీయార్ పార్టీని స్థాపించి జనంలోకి వచ్చారు. దాంతో ఆయన లెగసీతో పాటు ఒక సామాజికవర్గం నటులంతా టీడీపీని ఇష్టపడతారు. అలాగే టీడీపీ కూడా చాలా మంది నటీనటులను ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసి ఆకట్టుకుంది. ఈ రోజుకు చూస్తే ఎన్టీయార్ కుమారుడు నందమూరి బాలక్రిష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాం సహా అంతా టీడీపీకి దన్నుగా ఉన్నారు.

ఇక నిర్మాతలు, ఇతర హీరోలు నటీనటులు, డైరెక్టర్ల మద్దతు టీడీపీకి ఎక్కువగా ఉంది. కొత్తగా పుట్టిన జనసేనను తీసుకుంటే పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పార్టీ అది. మెగా కుటుంబం అంతా జనసేనకు మద్దతుగా ఉంటారు అన్నది రుజువు అవుతోంది. దాంతో పాటు ఇతర నటులు బలమైన సామాజిక వర్గం కూడా జనసేనకు అండగా ఉంటున్నారు.

ఎటొచ్చి వైసీపీకే ఇలాంటి అండా దండాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సినీ పరిశ్రమ నుంచి ఎవరూ అభినందనలు తెలియచేయలేదు అన్నది ఒక ప్రచారం ఉంది. అయితే ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం తనదైన శైలిలో సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణాయలు తెచ్చిన జీవోలు వివాదాస్పదం అయ్యాయి. దాంతో దగ్గర చేసుకోవడం పక్కన పెడితే దూరం పెరిగింది. ఈ మధ్యలో సినీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఇతర నటులు, నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ముఖ్యమంత్రి జగన్ని కలసి వచ్చారు.

అలా సినీ రంగం నుంచి మద్దతు వైసీపీకి పెరుగుతోంది అనుకున్న దశలో మళ్లీ గ్యాప్ అయితే ఏర్పడింది. ప్రభుత్వం పరంగా సినీ పరిశ్రమ ఏమి కోరుకుంటోందో అవన్నీ చేస్తామని హామీ ఇచ్చారని స్వయంగా చిరంజీవి అప్పట్లో చెప్పారు. కానీ అవి ఎంతవరకూ అమలు అయ్యాయో తెలియలేదు.

ఏది ఏమైనా వైసీపీతో సఖ్యతగా ఉంటారు అని అంతా భావించిన చిరంజీవి కూడా గొంతు విప్పి వైసీపీని విమర్శించారు. ఇక అక్కినేని నాగార్జున వైసీపీకి జగన్ కి సన్నిహితులు అన్న ప్రచారం ఉన్నా ఆయన రాజకీయాలకు బహు దూరం.

టోటల్ గా సినీ పరిశ్రమ నుంచి తీసుకుంటే పోసాని క్రిష్ణ మురళి, అలీ వంటి వారే వైసీపీలో ఉన్నారు. మొదట్లో వచ్చిన మంచు మోహన్ బాబు, జీవితా రాజశేఖర్, జయసుధ వంటి వారు ఇపుడు కనిపించడంలేదు. సినీ పరిశ్రమ ఏపీ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేస్తున్న నేపధ్యంలో వెండి తెర కాంతులు వైసీపీ మీద ప్రసరించకపోవడానికి కారణాలు ఎన్ని అంటే చాలా అని జవాబు వస్తుంది.

టెక్నికల్ గా చూస్తే సినీ పరిశ్రమ హైదరాబాద్లో లోకేట్ అయి ఉంది. తెలంగాణా ప్రభుత్వంతో పరిశ్రమ దగ్గరగానే ఉంటోంది. భౌతికంగా ఏపీకి దూరం అయితే టీడీపీ హయాంలో ఆ దూరాన్ని తగ్గించుకుంది. కానీ వైసీపీ మాత్రం గ్యాప్ పెంచుకుందా అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు ఖాయమైతే టోటల్ సినీ పరిశ్రమ ఒక్కటిగా మారి వైసీపీకి యాంటీగా ప్రచారంలోకి దిగుతుందా అన్నదే ఇపుడు తీవ్రమైన చర్చగా ఉంది.