Begin typing your search above and press return to search.

వైసీపీ అభ్యర్థుల ఫైనల్‌ లిస్టు అప్పుడే!

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ పావులు కదుపుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 5:34 AM GMT
వైసీపీ అభ్యర్థుల ఫైనల్‌ లిస్టు అప్పుడే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చారు. వీరిని వేరే నియోజకవర్గాలకు జంబ్లింగ్‌ (మార్పిడి) చేశారు. మరికొందరికి పూర్తిగా టికెట్లు నిరాకరించారు.

అభ్యర్థుల మార్పులచేర్పుల్లో భాగంగా మొదటి విడతలో 11 స్థానాల్లో వైసీపీ అధినేత జగన్‌ మార్పులు చేపట్టారు. ఇక కొద్దిరోజుల క్రితం రెండో విడతలో మరికొన్ని స్థానాల్లో మార్పులు జరిగాయి. రెండో విడతలో ఏకంగా 24 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేశారు. అదేవిధంగా మూడు పార్లమెంటు స్థానాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.

కాగా రెండు విడతలతోనే కాకుండా ఇంకా మరికొన్ని విడతలు ఉంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం 62 స్థానాల వరకు మార్పులు ఉంటాయని అంటున్నారు. గత కొద్ది రోజులుగా సీఎం వైఎస్‌ జగన్‌ రోజూ ఎమ్మెల్యేలతో, పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జనవరి 4న కూడా సీఎం జగన్‌ మరికొందరు ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను, మంత్రులను కలవనున్నారని చెబుతున్నారు. మరో రెండు మూడు రోజులపాటు పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో మాట్లాడతారని పేర్కొంటున్నారు. అలాగే ఐప్యాక్‌ సర్వే నివేదికలు, సీనియర్‌ నేతల అభిప్రాయాలను బేరీజు వేసుకున్నాక అభ్యర్థులను ప్రకటిస్తారని వివరిస్తున్నారు.

మొత్తం మీద జనవరి మొదటి వారం నాటికల్లా దాదాపు అభ్యర్థుల ఫైనల్‌ లిస్టు సిద్ధమవుతుందని సమాచారం. టీడీపీ, జనసేన అభ్యర్థులు ఖరారయ్యాక మళ్లీ అప్పటికప్పుడు కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. అయితే జనవరి మొదటి వారం నాటికి దాదాపు మొత్తం అభ్యర్థులను ఫైనల్‌ చేస్తారని అంటున్నారు.

అభ్యర్థులు ఫైనల్‌ అయితే వారిని వారివారి నియోజకవర్గాలకు పంపడం, పార్టీ నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం వీలవుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అభ్యర్థుల ఫైనల్‌ లిస్టు ఖరారయితే ఇక పూర్తిగా ప్రచారం, పార్టీ కార్యక్రమాలపైన దృష్టి పెట్టొచ్చని యోచిస్తోంది.