Begin typing your search above and press return to search.

గ్రేటే.. వైసీపీ ఫైర్‌ బ్రాండ్లు అప్పుడే వచ్చేశారు!

ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి ఈ ఫైర్‌ బ్రాండ్లు కూడా కారణమనేవారు ఉన్నారు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 6:30 AM GMT
గ్రేటే.. వైసీపీ ఫైర్‌ బ్రాండ్లు అప్పుడే వచ్చేశారు!
X

వైసీపీలో మాజీ మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ లకు ఫైర్‌ బ్రాండ్లుగా పేరుంది. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లపై తీవ్ర విమర్శలు, దుమ్మెత్తిపోయడంలో వీరే తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి ఈ ఫైర్‌ బ్రాండ్లు కూడా కారణమనేవారు ఉన్నారు. వీరి నోటి దురుసు, అహంకారపూరిత మాటలే వైసీపీకి డ్యామేజీ చేశాయనే విమర్శలు ఉన్నాయి.

వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ నేతలయిన రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఈ నేతలు కొన్నాళ్లపాటు మీడియాకు ముఖం చూపించరని, ప్రజల ముందుకు రారని అంతా భావించారు. వీరిలో కొందరు నేతలయితే రాష్ట్రంలోనే లేరని.. రాష్ట్రం విడిచిపోయారనే ఊహాగానాలు నడిచాయి.

అయితే ఓటమి భారం నుంచి వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ నేతలు త్వరగానే కోలుకున్నట్టు కనిపిస్తోంది. మీడియా ముందుకొచ్చి ఈ నేతలంతా మళ్లీ తమ నోటికి పనిచెప్పారు. రుషికొండలో భవనాలపై మాట్లాడిన రోజా అవి పర్యాటక భవనాలని తేల్చిచెప్పారు. రుషికొండ భవనాలపై టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్రా జరిగిందే రూ.100 కోట్లతో అని రూ.100 కోట్ల స్కామ్‌ జరిగిందని చెప్పడం సిల్లీగా ఉందన్నారు.

ఇక సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంబటి రాంబాబు అయితే ఏకంగా పోలవరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును తమ హయాంలోనే ఎక్కువ శాతం పూర్తి చేశామని.. ఆయన బోర్డులపై బొమ్మలు గీస్తూ మీడియా ప్రతినిధులకు వివరించారు. పోలవరం ఇలా తయారుకావడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు.

అలాగే గుడివాడ నుంచి పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూసిన కొడాలి నాని కూడా రుషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలు అని తేల్చిచెప్పారు. అవి జగన్‌ కోసం కట్టుకున్నవి కాదన్నారు. జగన్‌ నివాస భవనాలు కాదని.. ప్రభుత్వ భవనాలని.. వాటిని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు వినియోగించుకోవచ్చన్నారు. తనను కొత్త ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చని.. తనను ఏదో చేసినంత మాత్రాన వైసీపీకి ఏంకాదని తేల్చిచెప్పారు. అలాగే జగన్‌ వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని ఎప్పటిలానే కొడాలి నాని ఫైరయ్యారు.

అదేవిధంగా గుడివాడ అమర్నాథ్‌ కూడా రుషికొండ భవనాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై అందరికంటే ముందు స్పందించారు. రాష్ట్రపతి, ప్రధాని వంటివారు విశాఖపట్నం వస్తే మంచి భవనాలు లేవని.. వారొస్తే ఉండటానికే తాము వాటిని నిర్మించామని చెప్పారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే రుషికొండలో భవనాలు నిర్మించామని తెలిపారు.

ఇక అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కూడా ఈ ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాననే సవాల్‌ పై మాట్లాడారు. తన సవాల్‌ కు టీడీపీ నేతలు ఎవరూ స్పందించలేదన్నారు. ఎవరైనా స్పందించి తన సవాల్‌ ను స్వీకరించి ఉంటే తాను మాటపై నిలబడేవాడినన్నారు. టీడీపీ గెలిచినంతమాత్రాన ఏమీ అయిపోలేదని.. వాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీలకు అమలు చేయకపోతే నిలదీస్తామని హెచ్చరించారు. ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పారు.

మొత్తానికి టీడీపీ, జనసేన శ్రేణులు, ప్రజల అంచనాలకు భిన్నంగా ఘోరంగా ఓడిపోయిన కొద్ది రోజులకే వైసీపీ ఫైర్‌ బ్రాండ్లు మీడియా ముందుకొచ్చేయడం, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం విశేషమనే చెప్పాలి. కొన్నాళ్లు పాటు వీరెవరూ కనపడకుండా పోతారని అందరూ అంచనా వేయగా దాన్ని తోసిరాజని ఈ ఫైర్‌ బ్రాండ్‌ నేతలంతా మీడియా ముందుకొచ్చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.