రంయ్ రంయ్ మంటూ విశాఖ రాజధాని....!
విశాఖకు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే శక్తి ఉన్నందునే పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ఎంపిక చేశారని అమంత్రి గుడివాడ అమరనాధ్ చెప్పడం గమనార్హం
By: Tupaki Desk | 29 Sep 2023 3:49 AM GMTవిశాఖకు జగన్ మకాం మార్చడం ఖాయం అయింది. ఒక వైపు అధికారికంగా పనులు మొదలయ్యాయి. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి వచ్చి మొత్తం సమీక్షించారు. అక్టోబర్ 24 విజయదశమి వేళ జగన్ మకాం మార్చడానికి కౌంట్ డౌన్ మొదలైనట్లే. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు వైసీపీ రాజకీయ పార్టీగా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది.
దాంతో వెల్ కం టూ వైజాగ్ క్యాపిటల్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదే విధంగా చూసుకుంటే తాజాగా విశాఖలో విశాఖ కార్యనిర్వహక రాజధానిగా స్వాగతిస్తూ జీవిఎంసి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రులు ఎమ్మెల్యేలు సహా వైసీపీ పరివారం మొత్తం హాజరైంది.
ఈ సందర్భంగా అంతా కలసి విశాఖకు రాజధాని వచ్చేసినట్లే అంటూ కీలక ప్రకటన చేశారు. విశాఖ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం మాత్రమే పాటుపడుతోందని, ఇది జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం అని కూడా వారు చెప్పడం విశేషం. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, విశాఖకు కార్యనిర్వాహక రాజధానితో మహర్ధశ పడుతుందని జోస్యం చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు కి కట్టుబడే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును ముమ్మరం చేశారని సుబ్బారెడ్డి చెప్పడం విశేషం.రాజధానికి విశాఖ అన్ని రకాలుగా అనుకూల నగరం అన్నారు. విజయ దశమి తరువాత విశాఖ నుంచే పరి పాలన సాగుతుందని మరో మారు ప్రకటించారు.
రాష్ట్రం విడిపోయాక విశాఖను రాజధానిగా టీడీపీ ప్రభుత్వం చేయకుండా అమరావతిని తమదైన స్వార్థ ప్రయోజనాల కోసం ఎంపిక చేశారని ఇదంతా చంద్రబాబు రాజకీయం అని ఆయన విమర్శించారు. భ్రమరావతిగా చూపిస్తూ బొమ్మలు మాత్రమే అక్కడ చూపారని వైవీ హాట్ కామెంట్స్ చేశారు.
విశాఖకు రాష్ట్రాన్ని ముందుకు నడిపించే శక్తి ఉన్నందునే పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ఎంపిక చేశారని అమంత్రి గుడివాడ అమరనాధ్ చెప్పడం గమనార్హం. దేశంలో విశాఖ తొమ్మిదవ సంపన్న నగరం అని అలాగే ఏపీలో అతి పెద్ద నగరం అని ఆయన గుర్తు చేసారు. వచ్చే నెల 16 న సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖలో ఇన్ఫోసిస్ ని ప్రారంభిస్తారని ఇలా విశాఖ అభివృద్ధి అంతా తమ ప్రభుత్వం చలవే అని మంత్రి చెప్పుకున్నారు. మొత్తానికి రంయ్ రంయ్ మని విశాఖ రాజధాని వచ్చేస్తోంది అంటూ వైసీపీ నేతలు ముందస్తు సంబరాలు షురూ చేశారు.