చిన్నమ్మకు వడ్డాణంలా.. వైసీపీ పాలన: నెటిజన్ల సటైర్లు
''ప్రతిపక్షాలు విమర్శిస్తే.. ఏదో రాజకీయం అనుకున్నా. కానీ, మోకాల్లోతుగోతుల్లో ప్రయాణించాలంటే.. ఎంత కష్టమో నాకు కూడా తెలిసివచ్చింది
By: Tupaki Desk | 29 Oct 2023 12:30 AM GMTఅసలమ్మకు అన్న పెట్టలేని వ్యక్తి.. చిన్నమ్మకు బంగారు వడ్డాణం చేయిస్తానన్నాడట-అనేది సామెత. అయితే.. ఇప్పుడు ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. నెటిజన్లు ఈ సామెతనే గుర్తు చేస్తున్నారు. అచ్చం ఈ సామెత మాదిరిగానే ఏపీలో వైసీపీ పాలన ఉందని అంటున్నారు. దీనికి కారణం.. తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
ఎక్కడిక్కడ నడుములోతు గుంతలతో రహదారులు కుంగిపోయి.. నానా రకాలుగా ప్రయాణికులను ఇక్కట్ల పాల్జేస్తున్నారు. ఇటీవల కూడా రోడ్డు సౌకర్యం లేక.. గర్భిణి అయిన తన భార్యను ఓ వ్యక్తి భుజాన వేసుకుని ఆసుపత్రికి తీసుకువచ్చిన విషయం రాష్ట్రంలో కలకలం రేపింది. ఇక, సాక్షాత్తూ మంత్రి చెల్లుబోయిన వేణు అయితే.. తన నియోజకవర్గం రామచంద్రపురం నుంచి రాజమండ్రికి వెళ్లే రహదారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
''ప్రతిపక్షాలు విమర్శిస్తే.. ఏదో రాజకీయం అనుకున్నా. కానీ, మోకాల్లోతుగోతుల్లో ప్రయాణించాలంటే.. ఎంత కష్టమో నాకు కూడా తెలిసివచ్చింది. రామచంద్రపురం నుంచి రాజమండ్రి మధ్య రోడ్డు పూర్తిగా పాడైపోయిం ది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి దారుణంగా ఉండే ఉంటుంది. తక్షణమే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపండి'' అని మంత్రి చెల్లుబోయిన వ్యాఖ్యానించారు. ఇది జరిగిన నాలుగురోజుల్లో సీఎం జగన్.. రహదారులపై చర్చించారు.
అయితే, ఆయన ఈ పాడైపోయిన.. గోతులు పడిన రోడ్ల విషయాన్ని పక్కన పెట్టి.. ప్రధాన రహదారులను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు విస్తరించే ప్రతిపాదనలు తీసుకురావాలని.. అధికారులను ఆదేశించా రు. అరె.. ఇప్పుడున్న రోడ్లు బాగాలేక.. ప్రజలు నానా తిప్పులు పడుతుంటే.. వాటిని బాగు చేయడం మానేసి.. ఇప్పటికే బాగున్న రహదాలను విస్తరించేందుకు సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేయమనడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ.. సంగతి!