ఈసారి బడ్జెట్ సెషన్ లో భావోద్వేగం...!
ఈసారి జరిగే అసెంబ్లీ మండలి సభలు వైసీపీ ఏలుబడిలో ఇవే చివరికి కావడం విశేషం
By: Tupaki Desk | 9 Jan 2024 1:30 AM GMTఈసారి జరిగే అసెంబ్లీ మండలి సభలు వైసీపీ ఏలుబడిలో ఇవే చివరికి కావడం విశేషం. ఈ టెర్మ్ ముగిసాక ఇక వచ్చేవి ఎన్నికలే. దాంతో బడ్జెట్ కి బదులుగా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టి ఈసారి సభలను ముగిస్తారు. అయితే ఈ చివరి సమావేశాలు సాధారణంగా ఉద్వేగంగా సాగుతాయి. ఎంతమంది మళ్ళీ గెలిచి సభకు వస్తారో అన్న టెన్షన్ అసెంబ్లీలో కనిపిస్తుంది.
అలాగే అయిదేళ్ల పాటు పనిచేసిన సభ్యులు మళ్ళీ అసెంబ్లీకి రావాలంటే ముందు టికెట్ సంపాదించాలి. ఆ మీదట ప్రజల తీర్పు అనే ఆశీర్వాదం కావాలి. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి బడ్జెట్ సెషన్ కంటే ముందే వైసీపీ అభ్యర్ధుల జాబితా రెడీ అవుతోంది. దాంతో టికెట్ దక్కని వారు ఎవరో తెలిసిపోనుంది.
మరి వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో అన్నది ఆసక్తికరం. ఇంకో వైపు చూస్తే వైసీపీకి ఈసారి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో ఎంతమందికి టికెట్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. అయితే బడ్జెట్ సెషన్ పెట్టే నాటికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మరి వారి విషయంలో సభలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాల్సి ఉంది.
ఇక ఈసారి బడ్జెట్ సెషన్ ని ఈ నెల చివరకు కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ సభలను ఒక మూడు నాలుగు రోజుల పాటు నిర్వహించి అనంతరం ఎన్నికల నగరా మోగిస్తారు. అలా చూసుకుంటే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈసారి ఎన్నికలు మార్చిలోనే జరుగుతాయని అంటున్నారు.
దాంతో జగన్ ముఖ్యమంత్రిగా అయిదేళ్ల పాటు ఏపీని పాలించిన అసెంబ్లీకి ఈసరి బడ్జెట్ సెషన్ చాలా ఇంపార్టెంట్ అని కూడా అంటున్నారు. టీడీపీ ఈసారి సమావేశాలకు వస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే సభకు వచ్చినా రాకపోయినా ఒక్కటే అన్న భావన ఉంది వారికి. వచ్చి నిరసన తెలియచేసినా సస్పెండ్ చేస్తారు.
ఇక గతంలో అయితే ఒక శాసన సభ కాలం ముగిసే ముందు జరిగే చివరి సమావేశాలలో ఎంతో భావోద్వేగం కనిపించేది. నాడు రాజకీయ ప్రత్యర్ధులుగానే అంతా ఉండేవారు. కానీ రాజకీయ శత్రుత్వం ప్రబలిన వర్తమానంలో అలాంటి సందడి అయితే కనిపించేది లేదు అనే అంటున్నారు.
మొత్తం మీద చూస్తే జగన్ జమానాలో ఈసారి జరిగే బడ్జెట్ సెషన్ లో వింతలూ విశేషాలు ఏమైనా ఉంటాయా ఉంటే ఉండవచ్చు అని అంటున్నారు. అది అధికార పక్షం వైపు నుంచే తప్ప విపక్షం వైపు నుంచి కాదని అంటున్నరు. ఇక రిబ్లిక్ డే తరువాత ఏ క్షణం అయినా అసెంబ్లీని సమావేశపరవచ్చు అని అంటున్నారు. సో వెయిటింగ్ ఫర్ లాస్ట్ అసెంబ్లీ సెషన్ అన్నట్లుగానే పరిస్థితి ఉంది.