Begin typing your search above and press return to search.

వైసీపీ ఒక్కసారిగా పుంజుకుందా ?

ఏపీలో పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది. కచ్చితంగా లెక్క కడితే ఇరవై రోజులు కంటే ఎక్కువ టైం లేదు

By:  Tupaki Desk   |   19 April 2024 11:19 AM GMT
వైసీపీ ఒక్కసారిగా పుంజుకుందా ?
X

ఏపీలో పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది. కచ్చితంగా లెక్క కడితే ఇరవై రోజులు కంటే ఎక్కువ టైం లేదు. అంటే ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్న మాట. మరి ఏపీలో రాజకీయం ఏ విధంగా సాగుతోంది. ఎవరి వైపు మొగ్గు ఉంది అన్నది కనుక చూస్తే గతానికి భిన్నంగా మెల్లగా ఏపీలో మార్పు అయితే కనిపిస్తోంది. మెల్లగా వైసీపీ పుంజుకుంటోంది అని తాజా రాజకీయ వాతావరణం చెబుతోంది అంటున్నారు.

ఇక చూస్తే ఏపీ ఎన్నికల్లో కొత్త కొత్త మార్పులు చాలానే వస్తున్నాయి. ఇపుడు ఎక్కడ చర్చ పెట్టినా వైసీపీ పుంజుకుంటోంది అన్న టాక్ అయితే బాగా స్ప్రెడ్ అవుతోంది. సిద్ధం సభలతో వైసీపీకి ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగింది అని అంటున్నారు.

అది కూడా ఏపీలో రాజకీయం బాగా మారుతోంది అని రచ్చబండ వద్ద జరిగిన సమావేశాలను చూస్తే అర్ధం అవుతోంది. అక్కడ చేరిన వారు అంతా ఈ విధంగానే చర్చించుకుంటున్నారు. క్రమంగా ఏపీ రాజకీయం వైసీపీకి అనుకూలంగా మారుతోంది అన్నది చిన్న స్థాయి మీటింగులలో వస్తున్న సారాంశంగా ఉంది.

మరో వైపు చూస్తే ఇప్పటికే ఎంపిక చేసిన వైసీపీ అభ్యర్థులు జనాల్లోకి దిగిపోయారు వారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు. దాంతో కూడా వైసీపీ అనుకూల వేవ్ వస్తోంది అని కూడా ప్రచారం సాగుతోంది. ఒక విధంగా ఇది వైసీపీకి ప్లస్ గా మారుతోంది అంటున్నారు.

మరో కీలక అంశం కూడా ఉంది అని అంటున్నారు. అదేంటి అంటే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడంతో ఒక్కసారిగా సీన్ చేంజ్ అయింది అని. అంటే కూటమి బలం కాస్తా తగ్గి బలహీనంగా మారింది అని అంటున్నారు. దాంతో వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది అని కూడా విశ్లేషణలు వస్తున్నాయి.

ఇక బీజేపీకి ఇచ్చిన పది అసెంబ్లీ సీట్లలో పెద్దగా వచ్చేవి అయితే లేవని కూడా లెక్క తేల్చేస్తున్నారు. అదే విధంగా జనసేన విషయం తీసుకుంటే ఆ పార్టీకి ఇచ్చిన సీట్లలో సగానికి సగం మంది ఓటమి పాలు అవుతారు అని అంచనాలు ఉన్నాయి. అంటే ఇరవై ఒక్క మందిలో పది మంది వరకూ గెలిచే చాన్స్ అయితే ఉందని అంటున్నారు.

మరి ఈ రెండు పార్టీలు ఓడిపోయే సీట్లు కలుపుకుంటే వైసీపీకి ఇరవై దాకా సీట్లు జేబులో ఉన్నట్లే అని అంటున్నారు. ఇక టీడీపీ కూటమిలో పెద్దన్నగా ఉన్న టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తోంది. ఏపీలో అధికారం దక్కించుకోవాలంటే 90 సీట్ల దాకా కనీసంగా సాధించాలి. కానీ ఆ బిగ్ నంబర్ ని ఈ సీట్లతో టీడీపీ సాధించే అవకాశాలు అయితే ఉండవని అంటున్నారు.

పైగా అది ఈజీ టాస్క్ కాదని అంటున్నారు. 144 సీట్లలో దాదాపుగా ప్రతీ సీటులో టఫ్ ఫైట్ ఇస్తేనే తప్ప 90 సీట్లు టీడీపీ సోలోగా గెలిచేందుకు వీలు లేదని అంటున్నారు. ఆ పరిస్థితి అయితే ఇపుడున్న రాజకీయ వాతావరణంలో అసలు ఉండదనే చెబుతున్నారు.

ఇక గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం నెల్లూరు, ప్రకాశం వంటి చోట్ల డైరెక్ట్ ఫైట్ వైసీపీ టీడీపీల మధ్యనే ఉంది. ఈ రెండు పార్టీల ముఖా ముఖీ పోరులో వైసీపీకే మొగ్గు ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ జనసేనకు పెద్దగా సీట్లు అయితే ఇవ్వలేదు. దాంతో ఆ పార్టీ ప్రభావం ఏమీ ఉండదని అంటున్నారు. అలాగే బీజేపీ పాత్ర కూడా ఏమీ ఉండదని అంటున్నారు.

దాంతో రాయలసీమలో వైసీపీ మెజారిటీ సీట్లు సాధించి తన ఖాతాను పదిలం చేసుకుంటుంది అని అంచనాలు వేస్తున్నారు. ఇక్కడే మరో పాయింట్ కూడా ఉంది. బీజేపీకి రాయలసీమ పెద్దగా బలం లేదు కానీ ఆ పార్టీతో పొత్తు వల్ల టీడీపీ కొంప కొల్లేరు అయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే చోట కానీ ఇతర బడుగు సామాజిక వర్గాలు ఉండే చోట కానీ బీజేపీ వల్ల టీడీపీకే ఇబ్బందిగా మారి యాంటీ ఓటింగ్ జరిగే చాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు.

మొత్తంగా చూసుకుంటే 2014 ఎప్పటికీ 2024 కాదని అంటున్నారు. అది ఫ్రెష్ గా కుదిరిన పొత్తు. అప్పటికి మోడీ మోజు ఉంది. పవన్ క్రేజ్ ఉంది. బాబు అనుభవం అన్న ఆయుధం ఉంది. ఇపుడు అన్నీ చూసేసిన తరువాత మూడు పార్టీలు మళ్లీ జట్టు కట్టి జనం ముందుకు వచ్చాయి. దాంతో ఈ పొత్తులో రాజకీయ అవకాశ వాదం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏవీ లేవని జనాలు అనుకుంటున్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు అయితే కచ్చితంగా ప్రత్యేక హోదా మీద హామీ ఇవ్వాలి. అలాగే పోలవరం నిధులు ఇచ్చి పూర్తి చేయాలి. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి. కానీ ఇవేమీ లేకుండా విభజన హామీలు ఏ మాత్రం నెరవేర్చని బీజేపీని వెంటబెట్టుకుని టీడీపీ కూటమి కట్టడం వల్ల భారీగా రాజకీయ నష్టం జరుగుతోంది అని అంటున్నారు. ఇది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది. సో ఓవరాల్ గా చూస్తే వైసీపీ పుంజుకుంది అన్న మాట అయితే వినిపిస్తోంది. చూడాలి మరి పోలింగ్ డే న జనాలు తీర్పు ఎలా ఉంటుందో.