Begin typing your search above and press return to search.

వలంటీర్లపై మరో రచ్చ.. హైకోర్టు ఏం చేయనుంది!

ఆంధ్రప్రదేశ్‌ లో వలంటీర్‌ వ్యవస్థపై తీవ్ర రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతలు వలంటీర్‌ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   6 March 2024 5:24 AM GMT
వలంటీర్లపై మరో రచ్చ.. హైకోర్టు ఏం చేయనుంది!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వలంటీర్‌ వ్యవస్థపై తీవ్ర రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతలు వలంటీర్‌ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ సేకరిస్తున్న డేటా మహిళల అక్రమ రవాణాకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వలంటీర్లను అక్రమ పద్ధతుల్లో ఉపయోగించుకుని ఎన్నికల్లో లాభపడాలని అధికార వైసీపీ భావిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ప్రతిపక్ష నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల విధుల్లో వలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా కేవలం చేతి వేలిపై సిరా వేయడానికి మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే ముఖ్యమంత్రి జగన్‌ తోసహా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితర నేతలు వలంటీర్లు వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. వలంటీర్లలో ఎక్కువ పోస్టులను వైసీపీ కార్యకర్తలకే కేటాయించామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో వలంటీర్లకు సత్కారం పేరుతో వారికి డబ్బులు, గిఫ్టులు, కుక్కర్లు, కొత్త దుస్తులు పంచుతున్నారని ప్రతిపక్ష నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలైంది. వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ ను ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంకు చెందిన చెన్నుపాటి సింగయ్య దాఖలు చేశారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామ, వార్డు వలంటీర్ల సన్మాన సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శిస్తూ మాట్లాడిన ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్‌ కోరారు.

వచ్చే ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల్లోకి వలంటీర్లు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల అధికారి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే వ్యక్తిగత హోదాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను ప్రతివాదిగా పేర్కొన్నారు.

ఇప్పటికే ఎన్నికల సంఘం వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.