Begin typing your search above and press return to search.

'కొండ‌పి'లో వైసీపీ ప‌రిస్థితి ఏంటి!

తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఆదిమూల‌పు సురేష్‌.. త‌న‌కు ఉమ్మ‌డి ప్ర‌కాశంజిల్లాలోని 'కొండపి' నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా వెళ్లడం సంతోషంగా ఉందన్నారు.

By:  Tupaki Desk   |   19 Dec 2023 3:48 AM GMT
కొండ‌పిలో వైసీపీ ప‌రిస్థితి ఏంటి!
X

స‌హ‌జంగా మంత్రిగా ఉన్న నాయ‌కుడు ఏం మాట్లాడినా.. సంచ‌ల‌నంగానే ఉంటుంది. ఆయ‌న మాట‌ల్లోనే కాదు.. ముఖంలోనూ క‌ళ కొట్టిచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. కానీ, ఏపీకి చెందిన మంత్రి ఆదిమూల‌పు సురేష్ గ‌త రెండు రోజులుగా డీలా ప‌డిపోయార‌నే టాక్ వినిపిస్తోంది. ఆయ‌న మాట్లాడుతున్న మాట‌ల్లో సంచ‌ల‌నాలు..మెరుపులు ఉన్నా..మొహంలో మాత్రం ఎక్క‌డా క‌ళ క‌నిపించ‌డం లేద‌న్న‌ది సోష‌ల్ మీడియా టాకే కాదు.. సొంత పార్టీ నేత‌ల అంత‌ర్గ‌త మాట కూడా! దీనికి కార‌ణం ఏంటి? అనేదే ఆస‌క్తిగా మారింది.

తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఆదిమూల‌పు సురేష్‌.. త‌న‌కు ఉమ్మ‌డి ప్ర‌కాశంజిల్లాలోని 'కొండపి' నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ కంచుకోటగా చెప్పుకుంటున్న కొండపిలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్సీ అభ్యర్థులను మారుస్తున్నారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నామన్నారు. పార్టీ విధి విధానాలు బట్టి మార్పులు ఉంటాయని చెప్పుకొచ్చారు. తమ పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగానే అభ్యర్థులు మార్పులు ఉంటాయన్నారు.

అయితే.. ఆయ‌న ఇంత సోదాహ‌ర‌ణ ప్ర‌సంగం చేసినా.. మొహంలో చిరున‌వ్వు కానీ.. త‌న‌ను కీల‌క‌మైన కొండ‌పికి పంపించార‌న్న ఆనందం కానీ.. ఆయ‌న‌లో క‌నిపించ‌డం లేదు. దీనికికార‌ణం.. పైన ఆయ‌న చెప్పుకొన్న‌ట్టు కొండ‌పి టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట‌. దీనిని వైసీపీ నాయ‌కులు కూడా అంగీక‌రిస్తారు. ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌భుత్వ వైద్యుడుగా ఉన్న డోలా బాల వీరాంజ‌నేయ స్వామి.. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌రఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, 2019లోనూ వైసీపీ గాలి వీచినా.. ఆయ‌న ఇక్క‌డ నిల‌దొక్కుని విజ‌యం సాధించారు.

పైగా.. 'ఉచిత డాక్ట‌ర్‌'గా డోలాకు ఇప్ప‌టికీ పేరుంది. ఆయ‌న ఎంత బిజీగా ఉన్నా.. ఎమ్మెల్యేగా తీరిక లేకుండా ఉన్నా.. ప్ర‌తి రోజూ ఉద‌యం 6-7 మధ్య ఉచితంగానే రోగుల‌కు చికిత్స అందిస్తారు. అంతేకాదు.. వారాంతాల్లో ఆప‌రేష‌న్ అవ‌స‌రం అయిన వారికి ఉచితంగానే చేస్తున్నారు. మందులు ఇత‌ర‌త్రా రోగులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఉచిత డాక్ట‌ర్‌గా డోలాకు తిరుగు లేదు.

పైగా వైసీపీకి ఇక్క‌డ బ‌ల‌మైన ఇంచార్జ్ లేన‌ట్టేన‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కొన్నాళ్లు ఎస్సీనాయ‌కుడు జూపూడి ప్ర‌భాక‌ర్ పేరు వినిపించినా.. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టేశారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గ‌ట్టెక్క‌డం ఈజీ కాద‌నే అంచ‌నాలు వున్నాయి. ఈ విష‌యం మంత్రి సురేష్కు కూడా తెలుసు. బ‌హుశ ఆయ‌న ఆ ఆవేద‌న‌తోనే ఉన్న‌ట్టుగా ఆయ‌న ముఖం చెప్పేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.