జగన్ ముఖ్యమంత్రి.. వైసీపీ ప్రభుత్వం.. కథేంటంటే..!
వాస్తవానికి అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజలను నమ్ముకున్న నాయకుడు గెలిచిన వ్యవహారం.. తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
By: Tupaki Desk | 12 Aug 2024 9:30 AM GMTఎన్నికలు జరిగి రెండు మాసాలకు పైగానే అయిపోయింది. ఫలితాలు వచ్చి.. ప్రభుత్వం మారి కూడా అంతే సమయం అయిపోయింది. కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. అయితే.. వైసీపీలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇంకా ఆ పార్టీనే అధికారంలో ఉన్నట్టుగా భావిస్తోంది. ఆ పార్టీనే ఇంకా రాష్ట్రాన్ని ఏలు తున్నట్టుగానే నాయకులు భావిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే.. ప్రజలకు దూరంగా మసిలారో.. ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంటున్నారు.
నిజానికి కూటమి సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై గ్రామీణ స్థాయిలో చర్చ కూడా జరుగుతోంది. ఇక, కూటమి సర్కారు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తోంది. ఇవన్నీ పైకి కనిపిస్తున్న విషయాలు. వీటిని కార్నర్ చేసుకుని ప్రజలకు చేరువ కావాల్సిన వైసీపీ ఇంకా ఇంటికే పరిమితమైంది. చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయకు అద్దెలు కట్టడం లేదని స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.
మరికొన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు వైసీపీకి చేతి నిండి పని ఉంది. కానీ, నాయకులు మాత్రం ఇళ్లు వదిలి బయటకు రాలేక పోతున్నారు. మరి దీనిని ఎలా చూడాలి? ఇక, పార్టీ అధినాయకుడు గతంలో మాదిరిగానే ఉంటున్నారు. అంతకు మించి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవడం లేదు. బయటకు కూడా అడపాదడపా వస్తున్నారే తప్ప.. ప్రజల మధ్యకు రావడమే లేదు. దీంతో ఇప్పటికీ.. జగన్ ముఖ్యమంత్రిగానే భావిస్తున్నారన్న వాదన విశ్లేషకులు చెబుతున్నారు.
వాస్తవానికి అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజలను నమ్ముకున్న నాయకుడు గెలిచిన వ్యవహారం.. తాజా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. చంద్రబాబును పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ ప్రజల మధ్య ఉన్నారు. నెలకు ఒక్కసారే వచ్చినా.. ఆయన ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టే విజయం దక్కించుకున్నారు. మరి ఈ తరహా ఆలోచన చేయడంలో వైసీపీ విఫలమవుతోందా? లేక, ఇంకా తమదే అధికారం అనుకుని ముందుకు సాగుతోందా? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం ప్రజల్లోకి రావడమే! మరి ఆ పనిచేయనంత వరకు .. వైసీపీ ప్రభుత్వంలోనే ఉందని భావిస్తున్నట్టుగా అంచనా వేయాలి.