వారసులకు నో టికెట్ అంటూనే.. జగన్ షాక్ ఇచ్చేశారుగా...?
వారం రోజుల తేడాలో చిత్తూరు జిల్లాలో ఇద్దరు కీలక నేతలకు జగన్ వరాలు ఇచ్చేశారు.
By: Tupaki Desk | 15 Aug 2023 3:00 AM GMTవైసీపీలో మెల్లగా ఎన్నికల మూడ్ వచ్చేస్తోందా అంటే సీన్ చూస్తే అలాగే కనిపిస్తోంది. ఎన్నికలకు సంబంధించి చక్కదిద్దుకునే కార్యక్రమం అయితే జగన్ స్వయంగా చేస్తున్నారు అని అంటున్నారు. కీలకమైన చోట్ల, కీలకమైన నేతలకు వరాలు ఇస్తున్నారు. అక్కడ కండిషన్లు కూడా కొంత సడలిస్తున్నారు అని ప్రచారం కూడా సాగుతోంది.
వారం రోజుల తేడాలో చిత్తూరు జిల్లాలో ఇద్దరు కీలక నేతలకు జగన్ వరాలు ఇచ్చేశారు. ఆ ఇద్దరూ జగన్ కి అత్యంత సన్నిహితులు అన్నది కూడా చూడాల్సి ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని ఇటీవల వెంటబెట్టుకుని మరీ వెళ్ళి సీఎం ని కలిశారు. ఈ సందర్భంగా అభినయ్ రెడ్డికి వచ్చే ఎన్నికలలో తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయించడానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగింది.
బెస్ట్ ఆఫ్ లక్. బాగా పనిచేసుకోమని కూడా జగన్ అభినయ్ కి చెప్పారని అన్నారు. ఇక భూమనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ కి జగన్ పచ్చ జెండా ఊపారని అంటున్నారు మరో వైపు చూస్తే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరేడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కి మరో కీలకమైన పదవి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ తుడా చైర్మన్ పదవిని ఇస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటిదాకా ఈ పదవిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. అయితే ఆయనకు పార్టీ తరఫున కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. అదే టైం లో వచ్చే ఎన్నికలలో చంద్రగిరి నుంచి మోహిత్ రెడ్డి పోటీ చేస్తారు అని అంటున్నారు. అందుకే మోహిత్ రెడ్డికే కీలకమైన క్యాబినెట్ ర్యాంక్ పదవిని జగన్ కట్టబెట్టారని అంటున్నారు. దీని వల్ల ఆయన ప్రోటోకాల్ సమస్య లేకుండా నియోజకవర్గంలో తిరిగేందుకు పార్టీ అభ్యర్ధిగా జనంలో ఉండేందుకు ఏర్పాటు అని అంటున్నారు.
ఇలా ఇద్దరు తండ్రులకు, కొడుకులకు జగన్ న్యాయం చేయడం ద్వారా తిరుపతి, చంద్రగిరి గెలుపు మీద కర్చీఫ్ వేసేశారు అని అంటున్నరు. ఇదే వరసలో మరికొంత మందికి కూడా వరాలు ఇస్తారని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో తాము తప్పుకుని కుమారులను పోటీకి దించాలనుకునే వారు అంతా ఇపుడు ఈ ఇద్దరు సీనియర్ నేతలను చూసి తమ గురించి కూడా ప్రస్తావిస్తున్నారు అని అంటున్నారు.
ఏది ఏమైనా కూడా జగన్ ఆలోచనలు చూస్తే గెలుపు గుర్రాలను ఎక్కడికక్కడ రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. అది కూడా వారసులు అని కాకుండా గెలుస్తారు అన్న వారినే పిలిచి పెద్ద పీట వేస్తున్నారు అని అంటున్నారు. మరి జగన్ ఆలోచనల మేరకు ఎంతమంది వారసులు సెట్ అవుతారో ఎవరికి టికెట్లు దక్కుతాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.