పై చేయి ఎవరిదో ?
జగ్గంపేట నియోజకవర్గం వైసీపీలో అంతఃకలహాలు పెరిగిపోతున్నాయి. ఎంఎల్ఏ-మాజీ ఎంపీ వివాదంతో రోడ్డున పడినట్లే అనుకోవాలి.
By: Tupaki Desk | 19 July 2023 5:43 AM GMTజగ్గంపేట నియోజకవర్గం వైసీపీలో అంతఃకలహాలు పెరిగిపోతున్నాయి. ఎంఎల్ఏ-మాజీ ఎంపీ వివాదంతో రోడ్డున పడినట్లే అనుకోవాలి. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అని మాజీ ఎంపీ తోట నర్సింహం మద్దతుదారులతో చెప్పుకుంటున్నారు. అంతటితో ఊరుకోకుండా నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో టికెట్ తనకే కన్ఫర్మ్ అవుతుందన్న ధీమాతో సిట్టింగ్ ఎంఎల్ఏ జ్యోతుల చంటిబాబు ఉన్నారు. అయితే మద్దతుదారులు ఊరుకోరు కదా. అందుకనే ఎంఎల్ఏ కూడా మద్దతుదారులతో ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటున్నారు.
ఒకవైపు ఎంఎల్ఏ మరోవైపు మాజీ ఎంపీ ఇద్దరు ఆత్మీయ సమావేశలతో జోరు పెంచటంతో మధ్యలో ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బందులు పడుతున్నారు. తోట నర్సింహం 2004.09 ఎన్నికల్లో ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రెండుసార్లు గెలిచారు. తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఇక చంటిబాబు కూడా 2009,14 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో వైసీపీలోకి వచ్చి పోటీచేసి గెలిచారు. అయితే చంటిబాబు మీద ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో టికెట్ మళ్ళీ చంటి బాబుకే ఇస్తారా లేదా అన్నది తేలలేదు. కారణాలు తెలీదు కానీ సడెన్ గా తోట నియోజకవర్గంలో తిరిగేస్తున్నారు. దాంతో ఇద్దరి మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. తన నియోజకవర్గంలో తాను ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటే ఎంఎల్ఏకి ఏంటని తోట లాజిక్ మాట్లాడుతున్నారు. ఆత్మీయ సమావేశాలు ఎందుకు పెట్టుకుంటున్నారో తనకు తెలీదా అని ఎంఎల్ఏ రివర్సులో వాయించేస్తున్నారు.
ఇదే విధమైన పంచాయితీ రామచంద్రాపురంలో కూడా మొదలైతే జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసును పిలిపించుకుని క్లాసు పీకినట్లు సమాచారం. మరి అలాంటి క్లాసే జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరికి పీకుతారో చూడాలి. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పార్టీలో టికెట్ కోసం విభేదాలు పెరిగిపోయి రోడ్డున పడటం ఎంతమాత్రం మంచిది కాదు. ఇలాంటి నియోజకవర్గాలు ఇంకా మరికొన్ని ఉన్నాయి. మరి వాటి విషయంలో జగన్ ఎప్పుడు దృష్టిపెడతారో వివాదాలకు ఎఫ్పుడు ఫులిస్టాప్ పెడతారో తెలీదు. అయినా జగన్ చెబితే నేతలు ఆగుతారా ?