Begin typing your search above and press return to search.

వైసీపీ నేతల శ్రీవారి బ్రేక్‌ దర్శనాలు.. నోరెళ్లబెట్టాల్సిందే!

ఇక అన్నిటికంటే ముఖ్యంగా వైసీపీ నేతలు శ్రీవారి బ్రేక్‌ దర్శనాలను తమ ఆదాయానికి ఆర్జనగా ఎంచుకున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 July 2024 9:21 AM GMT
వైసీపీ నేతల శ్రీవారి బ్రేక్‌ దర్శనాలు.. నోరెళ్లబెట్టాల్సిందే!
X

వైసీపీ ఐదేళ్ల పాలనలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల ప్రతిష్టను మసకబార్చిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఆరోపించాయి. ముఖ్యంగా లడ్డూల నాణ్యత తగ్గిపోయిందని.. క్యూలైన్లలో ఉన్నవారికి ఆహారం, పాలు అందజేయడం లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. తిరుమల కొండపైన అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.

ఇక అన్నిటికంటే ముఖ్యంగా వైసీపీ నేతలు శ్రీవారి బ్రేక్‌ దర్శనాలను తమ ఆదాయానికి ఆర్జనగా ఎంచుకున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద ఎత్తున బ్రేక్‌ దర్శనాలకు సిఫారసు లేఖలు ఇచ్చారని చెబుతున్నారు. ఏక కాలంలో ఒకేసారి చాలా మందికి తమ సిఫారసు లేఖలపై బ్రేక్‌ దర్శనం కల్పించి.. భారీగా వెనకేసుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా చిత్తూరు జిల్లాకే చెందిన నాటి మంత్రులు ఆర్కే రోజా, నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి తరచూ వీలైనన్ని ఎక్కువ సార్లు దర్శనానికి వచ్చేవారని అంటున్నారు. వీరితోపాటు పెద్ద ఎత్తున అనుచర గణాన్ని, తదితరులను దర్శనాలకు తీసుకొచ్చేవారని గుర్తు చేస్తున్నారు. అలాగే చాలా మందికి దర్శనాలు కల్పించాలని, తోమాల సేవకు అవకాశం ఇవ్వాలని తమ సిఫారసు లేఖలు ఇచ్చేవారని అంటున్నారు. ఈ మేరకు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి తదితరులు ఇచ్చిన సిఫారసు లేఖలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వీరే కాకుండా నాటి మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు.. గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్, మద్దిల గురుమూర్తి తదితరులు తరచూ మందీ మార్బలంతో తిరుమలకు వచ్చేవారని.. వారందరికీ బ్రేక్‌ దర్శనాలు, వీఐపీ దర్శనాలు చేయించి సామాన్య భక్తులను ఇబ్బందిపెట్టేవారనే విమర్శలున్నాయి.

ఒక్కో సిఫారసు లేఖపై ఒక్కో నేత 50 మంది, 40 మంది, 32 మంది.. ఇలా పదుల సంఖ్యలో బ్రేక్‌ దర్శనాలు, వీఐపీ దర్శనాలు కల్పించాలంటూ లెటర్లు ఇచ్చారని స్పష్టమవుతోంది.

కేవలం బ్రేక్, వీఐపీ దర్శనాలే కాకుండా తోమాల సేవ, సర్వదీపాలంకరణ సేవ, సుప్రభావ సేవ, ఆర్జిత సేవా, కళ్యాణోత్సవం టికెట్లను కూడా వైసీపీ నేతలు ఇప్పించి భారీగా సొమ్ము చేసుకున్నారని అభియోగాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. ఆయన స్థానంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్యామలరావును ఈవోగా నియమించింది. త్వరలో టీటీడీ బోర్డు చైర్మన్‌ ను కూడా నియమించనుంది. అలాగే వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో టీటీడీ బోర్డు తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సమీక్షించనుందని సమాచారం.

ఈ మేరకు సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. సీఎం కాగానే ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడతామని స్పష్టం చేశారు. తప్పులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు శ్రీవారి బ్రేక్‌ దర్శనాల్లో ఇచ్చిన సిఫారసు లేఖలపైనా విచారణ ఉండొచ్చని అంటున్నారు.