మార్గదర్శిలో రోజా చిట్!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా నామినేషన్లు వేస్తున్నారు
By: Tupaki Desk | 20 April 2024 10:26 AM GMTఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా నామినేషన్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా తమ ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్లో సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో నగరి ఎమ్మెల్యే, పర్యాటక శాఖా మంత్రి రోజా అఫిడవిట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రోజా సమర్పించిన అఫిడవిట్లో మొత్తం 4.58 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తేలింది.
అలాగే 6.05 కోట్ల స్ధిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో రోజా తనకు ఆరు కార్లు, ఓ బైక్ ఉన్నట్లు చెప్పగా.. ఈసారి 9 కార్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. దీన్ని బట్టే ఆమె ‘వృద్ధి’ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంగతి పక్కన పెడితే తనకు మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో తనకు ఓ చిట్ ఉన్నట్లు రోజా వెల్లడించడం విశేషం. ఎల్టీ0330వీ ఎంఏ/48 నంబరుతో రూ.39.21 లక్షల విలువైన చిట్ ఉన్నట్లు ఆర్కే రోజా తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.
మరో ప్రైవేటు చిట్ లో తనకు రూ.32.90 లక్షల చిట్ ఉన్నట్లు తెలిపారు. రోజా చిట్‌లు వేయడం విశేషం ఏమీ కాదు కానీ.. మార్గదర్శి సంస్థలో ఆమెకు చిట్ ఉండడమే ఆశ్చర్యం కలిగించే విషయం. మార్గదర్శిని వైసీపీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఎలా టార్గెట్ చేస్తోందో తెలిసిందే. ఆ సంస్థ మీద పలు కేసులు నమోదు చేసి తరచుగా రామోజీ, ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది.
ఓవైపు మార్గదర్శివన్నీ అక్రమాలని వైసీపీ ఆ సంస్థను టార్గెట్ చేస్తుంటే.. అందులోనే వైసీపీ మంత్రి చిట్ కడుతున్న విషయం వెల్లడి కావడం చర్చనీయాంశం అయింది. సామాన్య జనాలకే కాదు.. మార్గదర్శి మీద వైసీపీ మంత్రికి కూడా ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి ఇదే రుజువు అని.. అలాంటి సంస్థను జగన్ సర్కారు ఇబ్బంది పెట్టడానికి శత విధాలా ప్రయత్నిస్తోందని వైసీపీ వ్యతిరేక వర్గాలు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఎత్తి చూపిస్తున్నాయి.