జగన్ ‘దర్బార్’ మొదలయినట్టేనా?
ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్క నేత, కార్యకర్తతో ఆయన ఫొటోలు తీసుకున్నారు.
By: Tupaki Desk | 1 Aug 2024 6:56 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా పరాజయం పాలైంది. వై నాట్ 175 అంటూ చివరకు 11 స్థానాలకే చాప చుట్టేసింది. వైసీపీ అధినేత జగన్, మంత్రి పదవులు నిర్వహించినవారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలినవారంతా ఓటమి పాలయ్యారు.
జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు పూర్తిగా తాడేపల్లి క్యాంప్ ఆఫీసు, నివాసానికే పరిమితమయ్యారని.. ప్రజలకు ఆయన దూరమయ్యారని.. అందుకే ఓటమి పాలు కావల్సి వచ్చిందని విశ్లేషణలు సాగాయి. 2019 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా, రైతుల కోసం ధర్నాలు, పాదయాత్ర ఇలా అనేక రూపాల్లో జగన్ ప్రజల్లోనే ఉన్నారు.
అయితే 2019లో అధికారంలోకి వచ్చాక పూర్తిగా జగన్ ప్రజలకు దూరమయ్యారని.. సలహాదారులు, ప్రాంతీయ సమన్వయకర్తలపైనే ఆధారపడ్డారని విమర్శలు వ్యక్తమయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు దూరం కావడం వైసీపీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు దగ్గరవడానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలు అయ్యాక రెండు పర్యాయాలు బెంగళూరులోని ఇంటిలో కొద్దిరోజులు గడిపిన జగన్ తాజాగా తాడేపల్లికి తిరిగొచ్చారు. ప్రజలు ఆయనను కలిశారు. పలు సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందించారు.
అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా తరలివచ్చారు. జగన్ ను కలిశారు. జగన్ కూడా గతంలో జరిగిన తప్పును గుర్తించి నేతలు, కార్యకర్తలకు బాగానే సమయం ఇచ్చారని అంటున్నారు. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్క నేత, కార్యకర్తతో ఆయన ఫొటోలు తీసుకున్నారు.
దీంతో ఇన్నాళ్లూ ఏదైనా సమస్య ఉంటే పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతోనూ, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సలహాదారులకు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైన పార్టీ నేతలు ఇప్పుడు జగన్ తమకు సమయం ఇస్తుండటం, ఆప్యాయంగా మాట్లాడుతుండటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఇతర నేతలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ప్రజాదర్భార్లు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆఫీసులోనూ ఎవరో ఒక ముఖ్య నేత ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.
జనసేన పార్టీ సైతం ఇదే విధానాన్ని అవలంబిస్తుంది. అధికారంలోకి రాకముందు జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే, ప్రజల నుంచి వివిధ సమస్యలపైన వారి వినతిపత్రాలు స్వీకరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఆయన ఇదే పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ సైతం ప్రజా దర్బార్ మొదలుపెట్టినట్టేనని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉండనున్న ఈ ఐదేళ్లూ వీలైనంత మేర ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని అంటున్నారు.