గన్నవరం ఎయిర్ పోర్టులో ఎస్సైని కొట్టిన వైసీపీ కార్యకర్తలు.. ఏం జరిగింది?
గన్నవరం ఎయిర్‌పోర్టులో వైసీపీ కార్యకర్తలు కొందరు స్థానిక ఎస్సైని కొట్టినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది
By: Tupaki Desk | 31 July 2024 3:51 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టులో వైసీపీ కార్యకర్తలు కొందరు స్థానిక ఎస్సైని కొట్టినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు.. పోలీసులు ఆయా కార్యకర్తల కోసం జల్లెడ పడుతున్నారు. ఎస్సైని దూషించడంతోపాటు.. ఆయన భుజంపై చేయి వేసి నెట్టేశారని కొందరు చెబుతుండగా.. లేదు.. ఆయనను కొట్టారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారం కోల్పోయినా.. వైసీపీకి అహంకారం పోలేదని.. అధికారులపైనే దాడులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో అసలు ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రెండు రోజుల కిందట బెంగళూరుకు వెళ్లారు. గురువారం అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేత పత్రం ప్రకటించిన తర్వాత.. అదేసమయంలో ఆయన మీడియా మీటింగ్ పెట్టారు. అనంతరం.. అదే రోజు ఆయన బెంగళూరుకు వెళ్లిపోయారు. కారణాలు తెలియవు కానీ..రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. మంగళవారం సాయంత్రం విజయవాడ శివారులోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులతో పాటు..ఎన్టీఆర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఈ సమయంలో విమానాశ్రయ ప్రధాన ప్రాంగణం కార్యకర్తలతో నిండిపోయింది. దీంతో సాధారణ ప్రయాణికులు బయటకు వచ్చేందుకు, బయట ఉన్నవారు లోపలికి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురయ్యారు. దీంతో కార్యకర్తలు శాంతించాలని.. స్థానిక గన్నవరం పోలీసులు అభ్యర్థించారు. అయితే, కార్యకర్తలు మాత్రం శాంతించకుండా నినాదాలు చేయడంతోపాటు..జగన్‌ను పలకరించేందుకు, ఆయనకు స్వాగతం పలికేందుకు వెంటబడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వివాదం, తోపులాట కూడా చోటు చేసుకుంది.
ఈ పరిణామాల క్రమంలో పలువురు కార్యకర్తలు స్థానిక ఎస్పై భుజంపై చేయి వేసి తోసేసినట్టు విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. తోయడం కాదు.. ఆయనను తన్నారంటూ.. టీడీపీ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు సదరు కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు జల్లెడ పడుతున్నారు. మరోవైపు.. కార్యకర్తల పరిస్థితిని వదిలేసి .. జగన్ తన కాన్వాయ్‌లో తాడేపల్లికి వెళ్లిపోయారు. మరోవైపు.. కార్యకర్తలను స్పాట్‌లోనేపట్టుకునేందుకుపోలీసులు ప్రయత్నించారని.. అయితే.. వారిని కూడా తోసేసి కార్యకర్తలు కాన్వాయ్‌లోని వాహనంలో వెళ్లిపోయారని పోలీసులు కూడా చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. చివరకు ఏం చేస్తారోచూడాలి.