ఆ ఎన్నారైలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హెచ్చరికలతో కూడిన సూచనలు!
ఈ సందర్భంగా ఈ విషయాలపై స్పందించిన అశోక్ బాబు ఏమన్నారనేది ఇప్పుడు చూద్దాం..! "మేము వస్తాం.. మీ సంగతి తేలుస్తాం అని చెబుతున్నారు.
By: Tupaki Desk | 30 March 2024 4:47 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇదే క్రమంలో... రోజుకో కీలక పరిణామం తెరపైకి వస్తుండటంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. పైగా ఈ ఎన్నికల్లోనూ వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తుండటం మరింత ఆసక్తిగా మారింది.
ఈ సమయంలో ప్రతీ ఓటూ కీలకంగా మారబోతోందని అంటున్నారు. మరోపక్క... ఎవరి ఓటు వాళ్లే వేయాలని, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకూ పాల్పడవద్దని, ఎన్నికల నియమావళిని అంతా కచ్చితంగా పాటించాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అంతా సహకరించాలని అధికారులు, నేతలు సూచిస్తున్నారు. ఈ సమయంలో... వేమూరు నియోజకవర్గంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఎన్నారైలకు సంబంధించినది కావడం గమనార్హం.
వేమూరుకు సంబంధించిన కొంతమంది ఎన్నారైలు... "మేము వస్తాం మీ సంగతి చెబుతాం.." అని వైసీపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారనే విషయం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి అశోక్ బాబు దృష్టికి వచ్చిందంట! దీంతో... ఈ విషయాలను ప్రస్థావిస్తూ... ఆయన ఎన్నారైలకు వార్నింగ్ ఇచ్చినట్లున్న ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్నారైలు వేమూరు నియోజకవరంలో ఎలాంటి గొడవలు చేసినా.. విదేశాలకు తిరిగి వెళ్లడానికి అవకాశం లేని పరిస్థితి కూడా ఉంటుందని హెచ్చరించారు!
ఈ సందర్భంగా ఈ విషయాలపై స్పందించిన అశోక్ బాబు ఏమన్నారనేది ఇప్పుడు చూద్దాం..! "మేము వస్తాం.. మీ సంగతి తేలుస్తాం అని చెబుతున్నారు. కానీ, అటువంటి సంస్కృతి వేమూరు నియోజకవర్గంలో ఇంతక ముందు ఎలా ఉండేదో తెలియదు కానీ.. ఇకముందు జరగడానికి వీలు లేదు" అని అన్నారు.
ఇదే క్రమంలో... "అటువంటి ఎన్నారైలు ఇక్కడకు వచ్చి అలాంటి గొడవలు ఏమైనా చేసినా... వాళ్లు తిరిగి ఎక్కడనుంచి వచ్చారో ఆ దేశానికి పోవడానికి వీలులేకుండా కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో.. ప్రశాంతంగా ఎవరి ఓట్లు వారు వేసుకుందాం. ఆ సత్తా, ధమ్మూ మీకుంటే.. ఈ గొడవలు జరగవని చెబుతా ఉన్నా" అని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.