అన్నా క్యాంటీన్లు...వైసీపీ సున్నం పెట్టుకున్నట్లే ?
అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్ధాల మీద వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు కూడా బూమరాంగ్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 18 Aug 2024 11:30 PM GMTభారతీయ సంప్రదాయం ప్రకారం చూస్తే అన్నం పెట్టే వారిని పరబ్రహ్మం తో సరిపోల్చుతారు. ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెడితే ఆ పుణ్యం కంటే వేరొకటి ఉండదు. ఏపీలో కూటమి సర్కార్ చేస్తోన్నది కూడా అదే. ఆకలితో ఉండే పేదలకు అతి కారు చౌకగా అన్నం పెడుతోంది. ఉదయం అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ కేవలం అయిదు రూపాయలకే అందిస్తోంది.
ఒక విధంగా చూస్తే కేవలం పదిహేను రూపాయలకే పేదవాడు పొట్ట పోసుకుంటున్నాడు. ఎవరు కాదన్నా ఇది మంచి పథకం. ఈ రోజులలో సైతం కూటికి గతి లేని వారు నూటికి ముప్పయి శాతం మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటిది ఒక ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పేరిట నామమాత్రం ధరతో అన్నం పెడితే ఎవరైనా హర్షించాల్సిందే.
ఇది కూటమి ప్రభుత్వం చేసిన అతి మంచి పనులలో అగ్ర స్థానంలో ఉంటుందని అంటున్నారు. అన్నా క్యాంటీన్లకు వెళ్ళి భోజనం చేసేది ఎక్కువగా నిరుపేదలు. వారు తమ కడుపు నింపుకునేందుకు అక్కడకు పోతున్నారు. ఆ విధంగా వారికి అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వం పట్ల వారు సానుకూలంగానే ఉంటారు.
అలాంటి అన్నా క్యాంటీన్లతో పెట్టుకుంటే వైసీపీ తానుగా సున్నం పెట్టుకున్నట్లే అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. వైసీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేసింది. ఆనాడు టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు ఏపీ శ్రీలంక అవుతుంది మరోటి అవుతుంది అని తీవ్రంగా విమర్శలు చేసినా చివరికి నాలిక కరచుకుని ఏమీ అనడం మానేసి సైలెంట్ అయ్యాయి.
దానికి కారణం అవి పేదలకు అందిస్తున్న పధకాలు. అలా పేదలకు దూరం కావడం ఇష్టం లేక వారి ఆగ్రహానికి గురి కావడం ఇష్టం లేకనే పొలిటికల్ మెచ్యూరిటీతో ఆనాటి విపక్షాలు వ్యవహరించాయి. ఇపుడు అదే రకమైన రాజకీయ తెలివిడిని వైసీపీ కూడా ప్రదర్శించాలని అంటున్నారు.
అన్నా క్యాంటీన్ల నిర్వహణలో లోపాలు ఉంటే చెప్పవచ్చు.లేదా వాటిని ఇంకాస్త బెటర్ గా ఎలా చేయవచ్చో కూడా సూచనలు ఇవ్వవచ్చు. అంతే తప్ప అన్నా క్యాంటీన్లనే తప్పు పడుతూ కామెంట్స్ చేస్తే మాత్రం అది టీడీపీ కూటమి కంటే కూడా పేదలకే నేరుగా వెళ్ళి గుచ్చుకుంటుందని అపుడు వైసీపీ రాజకీయమే ఉల్టా సీదా అవుతుందని అంటున్నారు.
అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్ధాల మీద వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు కూడా బూమరాంగ్ అవుతున్నాయి. అక్షయపాత్ర ఆహార పదార్ధాలను సరఫరా చేస్తోంది. ఆ సంస్థకు ఈ విషయంలో ఎంతో పేరు ఉంది. పైగా అన్నా క్యాంటీన్లు గతంలో నిర్వహించినపుడు కూడా ఇదే సంస్థ సరఫరా చేసింది. ఆనాడు కూడా ఏ రకమైన ఫిర్యాదులూ రాలేదు. పైగా జనాలు ఇష్టపడి మరీ తిన్నారు.
అన్నా క్యాంటీన్లు 2019 మధ్యలో కొన్ని ఎంపిక చేసిన చోటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. అనతికాలంలోనే అవి ఎంతో ఆదరణకు నోచుకున్నాయి. వైసీపీ వచ్చాక వాటిని కొనసాగించి ఉంటే బాగుండేది అన్న మాట కూడా ఉంది. అవసరం అయితే వైఎస్సార్ క్యాంటీన్లుగా మార్చి అయినా నడపాల్సింది. అలా చేయలేదు. దాంతో విమర్శల పాలు అయింది.
ఇపుడు కూటమి ప్రభుత్వం వస్తూనే అన్నా క్యాంటీన్లను తెరిపించింది. దాంతో వైసీపీకి ఈ పథకం మింగుడు పడడం లేదని అంటున్నారు. కానీ పేదల కోసం పెట్టిన పధకం కాబట్టి విమర్శలు కట్టిపెట్టి మరింత మెరుగైన విధానంలో ఎలా నడపవచ్చో సూచనలు ఇవ్వాలి.
అన్నా క్యాంటీన్లకు విరాళాలు ప్రభుత్వం కోరడంలోనూ తప్పు లేదు. సమాజంలో ఎంతో మంది పెద్ద హోదాలలో ఉంటారు. వారు విరాళాలు ఇస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. పేదలకు న్యాయం జరుగుతుంది. అందువల్ల ఇవ్వన్నీ కువిమర్శలుగానే అంతా చూస్తున్నారు. ఏది ఏమైనా అన్నా క్యాంటీన్లు సక్సెస్ అయిన పధకం. దాని మీద విమర్శల కంటే ఇస్తే సలహాలు ఇవ్వడం లేదా సైలెంట్స అవడమే వైసీపీ చేయాల్సింది అని అంటున్నారు.