జగన్ ది పిచ్చి నిర్ణయం...కేసీయార్ అదే చేశారుగా...!
మరో వైపు చూస్తే జగన్ ది పిచ్చి నిర్ణయం అని ఒకనాడు విమర్శించిన కేసీయార్ ఇపుడు జగన్ బాటలో నడవడం పట్ల ఏపీలో చర్చ సాగుతోంది
By: Tupaki Desk | 2 Aug 2023 2:30 AM GMTజగన్ కి పరిపాలనలో క్రెడిట్ దక్కేలా ఒక కీలక నిర్ణయానికి తెలంగాణాలో కేసీయార్ ఆమోదముద్ర వేసింది. దాంతో శభాష్ జగన్ అని చెప్పకుండానే బీయారెస్ అధినాయకత్వం చెప్పినట్లు అయింది. జగన్ 2019లో అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.
అప్పట్లో పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అతి పెద్ద ఉద్యమాలు జరిగాయి. దానికి కేసీయార్ ససేమిరా అనేశారు. అదే టైం లో ఏపీలో జగన్ ఆర్టీసీని విలీనం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దీంతో మండుకొచ్చిన కేసీయార్ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని పిచ్చి నిర్ణయం అని విమర్శించారు. ఈ నిర్ణయం ఏ రకంగానూ వర్కౌట్ కాదు, ఆరు నెలలలో తిరిగి ఆర్టీసీని కార్పోరేషన్ గానే మారుస్తారు చూస్తూ ఉండండి అంటూ కేసీయార్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని జగన్ ప్రకటించారు. గత మూడేళ్ళుగా ఎటువంటి ఇబ్బందులు లేకుందా ఆర్టీసీ సజావుగా పనిచేస్తోంది. పైగా సమర్ధంగా కూడా పనితీరు ఉందని అంటున్నారు.
ఈ నేపధ్యంలో తాజాగా తెలంగాణా ప్రభుత్వం కూడా అక్కడ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుని ఇక గవర్నర్ ఆమోద ముద్ర పడితే ఈ డెసిషన్ అమలు లోకి వస్తుంది అన్న మాట. దీని మీద జనంలో బాగా ప్రచారం చేయాలని మంత్రి కేటీయార్ పార్టీ వారిని కోరుతున్నారు.
మరో వైపు చూస్తే జగన్ ది పిచ్చి నిర్ణయం అని ఒకనాడు విమర్శించిన కేసీయార్ ఇపుడు జగన్ బాటలో నడవడం పట్ల ఏపీలో చర్చ సాగుతోంది. వైసీపీ కూడా దీన్ని హైలెట్ చేస్తోంది. తమ నాయకుడు ముందు చూపుతో తీసుకున్న ఒక నిర్ణయం మిగిలిన రాష్ట్రాల వారు అనుసరిస్తున్నారు అని ఆ పార్టీ వారు అంటున్నారు.
జగన్ విషయం తీసుకుంటే ఆయన 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పార్టీ పెట్టి సీఎం అయ్యారు. కేసీయార్ తో పోలిస్తే జగన్ రాకీయంగా చాలా జూనియర్ అని చెప్పాలి. మరి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇపుడు తెలంగాణా అమలు చేస్తోంది అంటే జగన్ డైనమిక్ లీడర్ షిప్ తెలుస్తోంది కదా అని అంటున్నారు.
అసాధ్యం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అన్న కేసీయార్ అదే నోటితో ఇపుడు విలీనం చేశారు. పైగా ఈ విలీనం వల్ల ఆర్టీసీ కార్మికులు బీయారెస్ పక్షాన నిలుస్తారు ఇది రాజకీయంగా లాభిస్తుంది. అలాగే ఖజానాకు కూడా ఆర్ధికంగా మేలు చేసే నిర్ణయం అని కేసీయార్ ఆలస్యంగా గుర్తించారు అని అంటున్నారు. ప్రతీ దానికీ తెలంగాణాతో పోలుస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని చులకన చేసే విపక్షాలు ఇపుడు ఏమంటారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.