Begin typing your search above and press return to search.

జ‌న‌మా.... జ‌గ‌నా.. వైసీపీ నేత‌ల‌కు ఏది ముఖ్యం..?

రాష్ట్రంలో వైసీపీ నాయకుల పరిస్థితి డోలాయ‌మానంలో పడింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నాయకులు ఇప్పటివరకు ప్రజల మధ్యకు వచ్చింది లేదు

By:  Tupaki Desk   |   23 Aug 2024 1:30 PM GMT
జ‌న‌మా.... జ‌గ‌నా.. వైసీపీ నేత‌ల‌కు ఏది ముఖ్యం..?
X

రాష్ట్రంలో వైసీపీ నాయకుల పరిస్థితి డోలాయ‌మానంలో పడింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నాయకులు ఇప్పటివరకు ప్రజల మధ్యకు వచ్చింది లేదు. ప్రజల కష్టాలు తెలుసుకున్నది కూడా లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చేసి దాదాపు మూడు నెలలు అయిపోయింది. ఈ మూడు నెలల కాలంలో వర్షాలు వరదలు సహా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరికొన్నిచోట్ల బాలికల పైన మహిళల పైన అత్యాచార ఘటనలు కూడా జరిగాయి. మరి ఎన్ని జరిగినా కూడా వైసిపి నాయకులు కానీ మాజీ మంత్రులుగాని ఒకరంటే ఒకరు కూడా ప్రజల మధ్యకు వచ్చింది కానీ వాళ్ళ ఇళ్లకు వెళ్లి బాధితులను పరామర్శించింది కానీ ఎక్కడా కనిపించడం లేదు.

మరి వారు ఏమనుకుంటున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ ఆదేశిస్తేనే ప్రజల మధ్య కు రావాలని వారు భావిస్తున్నారా? జగన్ ఆదేశిస్తేనే ప్రజల సమస్యలు పట్టించుకోవాలని అనుకుంటున్నారా? అనేది ఒక విషయం. అయితే మరొకటి.. వాళ్లకి వ్యక్తిగతంగా అసలు ప్రజల సమస్యలను పట్టించుకోవాలని ఉందా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది. గెలుపు ఓటములనేది సహజం. ఏ ఎన్నికల్లో అయినా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ప్రజలు నిర్ణయించే విషయం.

అయితే ప్రజా నాయకులుగా ఎదగాలనుకున్న వారు ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండాలి. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రజల సమస్యలను పట్టించుకోవాలి. కానీ, వైసీపీలో మాత్రం జగన్ కోసమే అన్నట్టుగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారనేది ఇప్పుడు ప్రధాన విమర్శ. లేకపోతే జగన్ తమకు అన్యాయం చేశాడు అనే బాధలో ఉన్నవారు మరికొందరు కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు. దీంతో ప్రజల సమస్యలను పట్టించుకునేందుకు వారు పెద్దగా ఉత్సాహం చూపించట్లేదు.

కానీ, ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు వారిని పట్టించుకున్న నాయకులకు ఇప్పుడు కాకపోతే వచ్చే ఎన్నికల నాటికైనా ప్రజలు పట్టం కడతారనేది వాస్తవం. మరి ఈ చిన్న విషయాన్ని నాయకులు గుర్తించలేకపోతున్నారా లేకపోతే ఇప్పుడే ప్రజల మధ్యకి వస్తే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని భావిస్తున్నారా అనేది కూడా ఒక సందేహంగానే మారింది. మరోవైపు పార్టీ అధినేత జగన్ నాయకులను ప్రజల మధ్యకు వెళ్లాలని గాని ప్రజలతో ఉండాలని చెప్పకపోవడం కూడా ఇక్కడ విశేషం.

గతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ప్రతి మంత్రిని ప్రతి ఎమ్మెల్యే ని ఇంటింటికి తిప్పిన జగన్ ఓడిపోయిన తర్వాత మాత్రం అసలు ప్రజల వద్దకు వెళ్లాలని గాని ప్రజల సమస్యలను పట్టించుకోవాలని చెప్పకపోవడం గమనార్హం. దీంతో అటు నాయకులు ఇటు పార్టీ అధినేత కూడా జనాలను పెద్దగా పట్టించుకోనట్టే కనిపిస్తున్నారు. మరి ఇదే పరిస్థితి ముందు కూడా కొనసాగితే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.