కూటమి తప్పులు తెలిశాయ్.. సరిదిద్దుకుంటారా...!
కానీ, వైసీపీ నాయకులకు కేవలం రెండు వారాలే పట్టడం గమనార్హం. ఇది మంచి పరిణామమే. అయితే.. తప్పులు తెలియడం.. ఎంత మంచి పనో.. వాటిని సరిదిద్దుకుని..
By: Tupaki Desk | 25 Jun 2024 6:03 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో 164 స్థానాలు దక్కించుకుని చరిత్ర సృష్టించారు. వైనాట్ 175 అన్న వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేశారు. ముసలి వాడు.. అని అవహేళన చేసినా.. ముందుకు సాగారు. ఆ ముసలి నాయకుడే ముదురు నాయకుడిగా మారి విజయం దక్కించుకున్నారు. ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు. ఇక, ఇప్పుడు వైసీపీ తన మూలాలను వెతుక్కునే పరిస్థితి వచ్చింది.
67 స్థానాలతో ప్రస్థానం ప్రారంభించిన వైసీపీ 151కి ఉవ్వెత్తున ఎదిగి.. 11కు పడిపోయింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? అంటే.. గత నాలుగు రోజులుగా ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. తమ తప్పులు తెలిశా యని నేరుగా ఒప్పుకోకపోయినా.. ఈ తప్పులు జరిగాయని పరోక్షంగా మాత్రం ఒప్పుకొన్నారు. మాజీ మంత్రుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు కొందరు నాయకులు.. వీరిలో జగన్ భక్తాగ్రేసరులు కూడా ఉన్నారు. వీరంతా తమ తప్పులు తెలుసుకున్నారు.
నోటి దూలతోనే ఓడామని, మద్యం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. వంటివి తీసుకువచ్చి.. నేల మట్టం అ య్యామని ఒకరు చెప్పారు. మరొకరు.. మరింత ముందడుగు వేసి.. కూల్చేశాం.. కాబట్టే.. మేం ఇక్కడ కూర్చున్నాం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొకరు వలంటీర్లను నమ్ముకుని నిండా మునిగామని.. సంక్షేమం మాత్రమే మాకు కనిపించింది తప్ప.. అభివృద్ధి కనిపించలేదని ఇలా.. తమ తమ విశ్లేషణలను చెప్పుకొచ్చారు.
మంచిది! ఏ పార్టీకైనా ఇదేకావాల్సింది. గతంలో చంద్రబాబు ఓడినప్పుడు కూడా.. ఎందుకు ఓడామో.. అర్ధం కావడం లేదంటూ.. ప్రకటన చేశారు. కానీ, ఆయన అసలు తప్పులు తెలుసుకునేందుకు చాలా సమయం పట్టింది. కానీ, వైసీపీ నాయకులకు కేవలం రెండు వారాలే పట్టడం గమనార్హం. ఇది మంచి పరిణామమే. అయితే.. తప్పులు తెలియడం.. ఎంత మంచి పనో.. వాటిని సరిదిద్దుకుని.. ప్రజాబాట పట్టి.. ప్రజల కోసం.. నిలబడతామని.. ప్రజల అభిప్రాయాలకు విలువ ఇస్తామని సంకల్పం చెప్పుకొని మార్పు దిశగా అడుగులు వేయడం మరో కీలక విషయం. మరి ఏం చేస్తారో చూడాలి.