Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ లో డేంజర్ బెల్స్ ?

వీటిని నమ్మమని అసలు ఫలితాలు మాకే అనుకూలమని వైసీపీ నేతలు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   2 Jun 2024 1:30 AM GMT
ఎగ్జిట్ పోల్స్ లో డేంజర్ బెల్స్ ?
X

ఏపీలో పాతిక మంది మంత్రులలో ఎక్కువ మందే ఈసారి ఇంటి బాట పడతారని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రా జిల్లాలలోని శ్రీకాకుళం నుంచి మొదలెడితే అనంతపురం జిల్లా దాకా చాలా మంది మంత్రులను పరాజయం పలకరిస్తుంది అని ఎగ్జిట్ పోల్ సర్వేలు చేదు నిజాన్ని చెప్పాయి.

వీటిని నమ్మమని అసలు ఫలితాలు మాకే అనుకూలమని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ పోలింగ్ సరళి తరువాత వచ్చిన ప్రాధమిక అంచనాలు చూస్తే చాలా మంది మంత్రులకు ఇబ్బంది అన్న మాట ఉంది. శ్రీకాకుళం జిల్లాలో సీదరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు ఓటమి పాలు అవుతారని సర్వేలు చెబుతున్నాయి.

విజయనగరంలో బొత్స సత్యనారాయణ టఫ్ ఫైట్ ని ఎదుర్కొన్నా గెలుస్తారని అంటున్నాయి. విశాఖ జిల్లాలో గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్నాధ్ ఓటమి పాలు అవుతారని చెప్పేశాయి. గోదావరి జిల్లాల విషయానికి వస్తే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ పినిపె విశ్వరూప్ వంటి వారికి ఇబ్బందులే అని అంటున్నాయి.

క్రిష్ణా జిల్లాలో జోగి రమేష్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని, గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన మంత్రి అంబటి రాంబాబు ఓటమి పాలు అవుతారని సర్వేలు ఘోషించాయి. మరో మంత్రి విడదల రజనీ తీవ్ర పోటీ ఎదుర్కొంటోందని ఇంకో మంత్రి వేమూరి నాగార్జునకు టఫ్ ఫైట్ ఉందని పేర్కొన్నాయి.

అలాగే గ్రేటర్ రాయలసీమలో ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరి మంత్రులకు టఫ్ ఫైట్ ఉందని చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు ఓటమి తప్పదని, అనంతపురంలో మహిళా మంత్రికి పరాజయమే ఎదురవుతుందని సర్వేలు అంటున్నాయి. ఇలా చూస్తే మెజారిటీ మంత్రులే ఓటమి బాట పడతారా అన్న చర్చ సాగుతోంది.

అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలు వేరు, అసలు నిజాలు వేరు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంచనా ఎపుడూ నిజం కాదని అలాగే గ్రౌండ్ లెవెల్ లో రియాల్టీస్ చాలా ఉంటాయని కొన్ని పసిగట్టలేక పోవచ్చు అని అంటున్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా కొందరు మంత్రులు ఓటమి పాలు అవుతారు అన్నది మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వేల కంటే ముందే ప్రచారంలో ఉందని గుర్తు చేస్తున్న వారూ ఉన్నారు. జూన్ 4 మాత్రం ఇలా లిస్ట్ లో ఉన్న వారికి భారీ టెన్షన్ డే గానే చెప్పాలని అంటున్నారు.