నా పేరుతో చండాలపు వీడియోలు పెడుతున్నారు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు!
తన ఫోన్ హ్యాక్ చేయాలని ఆస్ట్రేలియాకు చెందిన సంస్థతో రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే తన ఫేస్ బుక్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని బాంబుపేల్చారు.
By: Tupaki Desk | 9 Jan 2024 5:29 AM GMTవైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన ఫోన్ హ్యాక్ చేయాలని ఆస్ట్రేలియాకు చెందిన సంస్థతో రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే తన ఫేస్ బుక్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని బాంబుపేల్చారు. టీడీపీకి చెందిన రాజకీయ ప్రత్యర్థులే ఇలా చేస్తున్నారనే అనుమానం ఉందని తెలిపారు.
ఇప్పటికే ఆధారాలతో సహా వైఎస్సార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. తన ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేయడమే కాకుండా తన పేరుతో అమ్మాయిల వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు కొంత డబ్బులు కూడా చెల్లించారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీని ఓడించడానికి టీడీపీ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులో తనను ఓడించడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
తన పేరుతో అమ్మాయిల వీడియోలు పోస్టు చేస్తుండటమే కాకుండా తన వ్యక్తిగత జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన ఆ వ్యక్తి గురించిన సమాచారం పోలీసులకు ఇచ్చానని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా ఎవరితోనూ శత్రుత్వం లేదన్నారు. కేవలం తనపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఇటువంటి కుట్రలే జరుగుతున్నాయనే అనుమానముందన్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తన మొబైల్ కు అమ్మాయిల వీడియో లింక్‌లు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా, మానసికంగా దెబ్బతీయడానికి ఆస్ట్రేలియాకు చెందిన సంస్థతో రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా ఆ సంస్థకు ఇప్పటికే కొంత డబ్బు ముట్టచెప్పారన్నారు. రాజకీయంగా తన ఎదుగుదల చూడలేకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
తన ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేసి అందులో అశ్లీల చిత్రాలు పెడుతున్నారన్నారు. తద్వారా తన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ని కలిసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనను టార్గెట్ చేసినవారిపై ఫిర్యాదు చేశారు.
కాగా వైఎస్ షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం ఉండదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకు వైసీపీది అరాచక పాలన అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. కాగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు.