Begin typing your search above and press return to search.

టీడీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే!

అధికార వైసీపీకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో బిగ్‌ షాక్‌ తగిలింది. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు.

By:  Tupaki Desk   |   2 March 2024 5:27 AM GMT
టీడీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే!
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార వైసీపీకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో బిగ్‌ షాక్‌ తగిలింది. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ మేరకు హైదరాబాద్‌ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్‌ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్‌ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మైలవరం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలినట్టేనని అంటన్నారు.

వసంత కృష్ణప్రసాద్‌ సీనియర్‌ రాజకీయ నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో హోం శాఖ మంత్రిగా పనిచేసిన వసంత నాగేశ్వరావు కుమారుడు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన కృష్ణప్రసాద్‌ మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఒక్కటే అమలు చేస్తే సరిపోదని.. అభివృద్ధిని కూడా చేపట్టాలని పలుమార్లు వసంత కృష్ణప్రసాద్‌ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ పనులు చేపట్టినవారు బిల్లులు రాక అప్పులపాలై వాటిని తీర్చడానికి పొలాలను అమ్ముకుంటున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌.. వసంత కృష్ణప్రసాద్‌ కు మైలవరం సీటును నిరాకరించారు. జెట్పీటీసీ సభ్యుడిగా ఉన్న తిరుపతిరావుకు మైలవరం సీటును ఇచ్చారు. దీంతో వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

వసంత కృష్ణప్రసాద్‌ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెబుతున్నారు. లేకపోతే కృష్ణా జిల్లాలోనే పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా బరిలో దింపొచ్చని టాక్‌ నడుస్తోంది.

వసంత కృష్ణప్రసాద్‌ మైలవరం నుంచి పోటీ చేసే పక్షంలో అక్కడ టీడీపీ ఇంచార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పెనమలూరు నుంచి పోటీ చేయిస్తారని చెబుతున్నారు. ఉమానే మైలవరంలో పోటీ చేస్తే వసంతకు పెనమలూరు సీటును ఇవ్వొచ్చని అంటున్నారు.