ఈ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ తరఫున కొత్త సీట్లోకి వెళ్తారా?
ఈ క్రమంలో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 7 Jan 2024 9:06 AM GMTఆంధ్రప్రదేశ్ లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి గెలుపొందడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలు స్థానాల్లో మార్పులుచేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి విడతలో 11, రెండో విడతలో 27 స్థానాల్లో ఆయన మార్పులుచేర్పులు చేశారు.
ఈ నేపథ్యంలో కొందరికి వారి స్థానాల నుంచి వేరే స్థానాలకు మార్చారు. మరికొందరికి మాత్రం సీట్లు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో సీట్లు లభించనివారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అలాగే ఉన్న చోట నుంచి వేరే చోటకు వెళ్లడం ఇష్టం లేనివారు వేరే పార్టీల వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది.
ఈ క్రమంలో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల తన నియోజకవర్గంలోని కంకిపాడులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మాట్లాడిన కొలుసు పార్థసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నా.. ప్రియతమ నేత జగన్ మాత్రం తనను గుర్తించడం లేదని హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి సౌమ్యుడు, వివాద రహితుడిగా పార్థసారధికి పేరుంది. వైఎస్ జగన్ రెండు విడతల మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి కోసం కొలుసు పార్థసారధి పేరు వినిపించింది. ఆయన యాదవ సామాజికవర్గానికి చెందినవారు. అయితే జగన్.. పార్థసారధికి మంత్రి పదవి ఇవ్వకుండా కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ కు ఇచ్చారు.
అయినా పార్థసారధి ఇన్నాళ్లూ సర్దుకుపోయారు. ఇప్పుడు కొలుసును పెనమలూరును విడిచిపెట్టి వచ్చే ఎన్నికల్లో బందరు ఎంపీగా పోటీ చేయాలని జగన్ కోరినట్టు చెబుతున్నారు. అయితే ఇది ఇష్టం లేని పార్థసారధి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి వచ్చారని ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు.. కొలుసు పార్థసారధికి నూజివీడు సీటును ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. నూజివీడులో పార్థసారధి సామాజికవర్గమైన యాదవులు భారీ సంఖ్యలో ఉండటంతో అక్కడి నుంచి పోటీ చేయాలని సూచించినట్టు టాక్. మరి పెనమలూరు నుంచి పార్థసారధి నూజివీడుకు వెళ్తారో, లేదో తెలియాల్సి ఉంది.
కాగా గతంలో 2004, 2009ల్లో ఉయ్యూరు, పెనమలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పార్థసారధి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యా శాఖ మంత్రిగానూ ఆయన పనిచేశారు. ఆయన కుటుంబం మొదట నుంచి టీడీపీలో ఉంది. పార్థసారథి తండ్రి రెడ్డయ్య యాదవ్ గతంలో టీడీపీ తరఫున బందరు ఎంపీగా కూడా గెలుపొందడం విశేషం. అంతేకాకుండా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు 2009లో ఏలూరు ఎంపీగానూ రెడ్డయ్య యాదవ్ పోటీ చేశారు.
ఈ నేపథ్యంలో కొలుసు పార్థసారధి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అందులోనూ పెనమలూరు, అంతకుముందు ఉయ్యూరు నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎక్కువ పర్యాయాలు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. కమ్మ సామాజికవర్గం ఓటర్లు పెనమలూరు నియోజకవర్గంలో అధికం.
పార్థసారధి వైసీపీని వీడటం నిజమైతే వైఎస్సార్సీపీకి గట్టి దెబ్బేనని చెప్పొచ్చు. పార్థసారధికి సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరుంది. అందులోనూ కృష్ణా జిల్లాలో యాదవ సామాజికవర్గం కొన్ని నియోజకవర్గాల్లో బలంగానే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్థసారధి పార్టీ వీడితే వైఎస్సార్సీపీకి గట్టి షాకేనని అంటున్నారు.