రఘువీరాతో భేటీ... కాంగ్రెస్ లోకి వైసీపీ ఎమ్మెల్యే?
అవును... అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వైసీపీ ఆల్ మోస్ట్ గుడ్ బై చెప్పినట్లే అనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Jan 2024 4:38 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న మార్పులు సరికొత్త సమస్యలను తెస్తున్నాయనే కామెంట్లు మొదటినుంచీ వినిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ ఆలోచనలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారు తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి చర్చనీయాంశం అయ్యారు.
అవును... అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వైసీపీ ఆల్ మోస్ట్ గుడ్ బై చెప్పినట్లే అనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో అధిష్టాణం టికెట్ నిరాకరించటంతో.. ఆయన సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరే తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని చెప్పే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇందులో భాగంగా... సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డిని మడకశిర మండలం నీలకంఠాపురంలోని ఆయన నివాసంలో కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికలకు పోటీ చేస్తానని అంటున్నారు. ఇదే సమయంలో తన కుటుంబంలో మరొకరు రాయదుర్గం నుంచి బరిలోకి దిగుతారని చెబుతున్నారు.
అంటే... వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి రామచంద్రారెడ్డి, రాయదుర్గం నుంచి ఆయన కుమారుడు ప్రవీణ్ పోటీచేయబోతున్నారని అంటున్నారు. వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్లు ఆశించినట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా... సుమారు రెండు గంటలకు పైగా సాగిన వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి.
ఇదే సమయంలో అన్నీ అనుకూలంగా జరిగితే ఈ రోజు ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్, ఏఐసీసీ సభ్యుడు ఠాగూర్ తో చర్చించి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఏది ఏమైనా... జగన్ పై అలిగిని, ఆగ్రహంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూడటం రాజకీయంగా ఆసక్తిని కలిగించే అంశమనే చెప్పాలి.