Begin typing your search above and press return to search.

రౌడీయిజంతో గెలిచామంటూ వైసీపీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్....!

ఇంతకీ ఎలా గెలిచామన్న దాని మీద కూడా ఎమ్మెల్సీ దువ్వాడ పూర్తి వివరాలను బయట పెట్టారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 9:33 AM GMT
రౌడీయిజంతో గెలిచామంటూ వైసీపీ ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్....!
X

ఇప్పటికి మూడేళ్ళ క్రితం జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో రౌడీయిజంతో గెలిచామని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో పార్టీ క్యాడర్ వద్ద చేసిన వ్యాఖ్యలు అంటూ సార్వత్రిక ఎన్నికల ముందర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మేము రౌడీయిజంతో గెలిచామని ఆయన చెప్పినట్లుగా ఆ ఆడియోలో ఉంది. ఇదంతా ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఇంతకీ ఎలా గెలిచామన్న దాని మీద కూడా ఎమ్మెల్సీ దువ్వాడ పూర్తి వివరాలను బయట పెట్టారు. టెక్కలి ఎమ్మెల్యే టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్ధిగా వైసీపీ నుంచి కింజరాపు అప్పన్నను పెట్టామని, అయితే ఆయన్ని నామినేషన్ వేయకుండా తెలుగుదేశం వారు అడ్డుకున్నారు. ఆ సాకుతో ఆ వూరి మీద దాడి చేసి మరీ సర్పంచ్ అభ్యర్ధిగా అప్పన్న చేత నామినేషన్ వేయించాను అని దువ్వాడ చెబుతున్నారు.

అంతే కాదు అచ్చెన్నాయుడు నన్ను కొట్టారు అని చెప్పి మరీ ఆయనను జైలులో పెట్టించామని, టీడీపీ క్యాడర్ ని బయటకు రానీయకుండా చేశామని, ఇక సంతబొమ్మాళి జెడ్పీటీసీ అభ్యర్ధి పుక్కళ్ళ శ్రీనివాసరావు మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయించామని, కోటబొమ్మాళి జెడ్పీటీసీ అభ్యర్ధి పూజారి శైలజ భర్త సత్యం ఇంటికి తలుపులు వేసి బయటకు రానీయకుండా బంధించామని దువ్వాడ ఆ ఆడియోలో అంటున్నట్లుగా ఉంది.

అదే విధంగా టెక్కలి.నందిగాంలలో కూడా జెడ్పీటీసీ అభ్యర్ధులు బయటకు రాకుండా అడ్డుకున్నామని, అలా నాలుగు వంతున ఎంపీపీలు జెడ్పీటీసీలు, అలాగే మొత్తం 136 పంచాయతీలలో 119 సర్పంచులను గెలుచుకున్నామని దువ్వాడ చెప్పిన ఆడియో తెగ వైరల్ అవుతోంది.

ఇలా టీడీపీ అగ్ర నేతలను భయపెట్టి వారిని బయటకు రానీయకుండా చేసి అరెస్టులు చేసి స్థానిక ఎన్నికల్లో గెలిచామని దువ్వాడ చెప్పుకుంటున్నారు అన్నది ఆడియో ద్వారా బయటకు వచ్చింది. ఈ వ్యాఖ్యలు అన్నీ అనుచరుల వద్ద దువ్వాడ చేశారు, అయితే అవి బయటకు రావడంతో రాజకీయంగా కలకలం రేపుతోంది. రౌడీయిజంతోనే గెలిచాం తప్ప ప్రజాభిమానంతో కాదు అన్నట్లుగా దువ్వాడ చేసిన ఈ కామెంత్స్ ద్వారా తెలుస్తోంది. అని అంటున్నారు.

ఒక విధంగా చూస్తే లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా నిమ్మాడలో జరిగిన ఘటనలు ఇప్పటికీ చాలా మందికి గుర్తు ఉంటాయి. అనాడు ఏపీ మొత్తం ఇటు వైపు చూసింది. అయితే దువ్వాడ ఆడియో వైరల్ కావడంతో ఇవి ప్రీ ప్లాండ్ గా చేసినవి అని టీడీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఇక ఆనాడు ఒక మామూలు నేతగా ఉన్న దువ్వాడకు ఆ తరువాత ఎమ్మెల్సీగా ప్రమోషన్ వచ్చిందని కూడా గుర్తు చేస్తున్నారు. దీనిని బట్టి రానున్న ఎన్నికల్లో రౌడీయిజంతో గెలుస్తారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కూన రవికుమార్ ఈసారి ఎన్నికలు సజావుగా సాగేలా లేవని డౌట్ వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోకపోతే హింసాత్మకం అవుతాయని అరాచకమే రాజ్యమేలుతుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇపుడు దువ్వాడ ఆడియో చూస్తే అదే నిజం అయ్యేలా ఉందని టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు.