వైసీపీ ఎమ్మెల్సీ జనసేనలోకి....ఆ హాట్ ఫేవరేట్ సీటు నుంచి పోటీ ....!?
ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం వారికి నచ్చచెబుతున్నా కూడా అధికారం అన్నది ఎవరికైనా అవసరమే.
By: Tupaki Desk | 27 Dec 2023 1:31 PM GMTవైసీపీలో సీటు చోటు దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం వారికి నచ్చచెబుతున్నా కూడా అధికారం అన్నది ఎవరికైనా అవసరమే. దీంతో పాటు ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అయిదేళ్ళ కాలం పాటు పోటీ చేయకుండా కూర్చోవడం అంటే కష్టం అంటున్నారు. దాంతో వైసీపీలో ఇంచార్జిల మార్పు ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ నేపధ్యంలో విశాఖ తూర్పు నుంచి వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీగా ఉన్న వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ ఫ్యాన్ నీడ నుంచి బయటకు వచ్చారు. బుధవారం ఆయన విజయవాడకు వెళ్లారు. మంగళగిరి ఆఫీసులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ తిరిగి తన సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని అన్నారు. ప్రజా రాజ్యం పార్టీలో వంశీ పనిచేశారు. 2009లో ఆయన ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా విశాఖ తూర్పు సీటు నుంచి పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు.
ఆ తరువాత ఆయన వైసీపీలోకి వచ్చారు. 2014లో ఆయన వైసీపీ నుంచి విశాఖ తూర్పు నియోజకవర్గంలో పోటీకి దిగారు. కానీ ఓటమి వరించింది. 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. 2024లో ఆయన పోటీకి తయారుగా ఉన్నా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఇంచార్జిగా కొద్ది నెలల క్రితం పార్టీ నియమించింది.
దాంతో వైసీపీ నుంచి ఇక టికెట్ ఆశలు లేవని భావించిన వంశీ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సడెన్ గా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. జనసేనలో చేరిపోయారు. ఆయనకు విశాఖ తూర్పు సీటు మీద మోజు ఉంది. అయితే అక్కడ వెలగపూడి రామక్రిష్ణ బాబు బలమైన నేతగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఉన్నారు.
ఆయన మూడు సార్లు గెలిచారు. 2024లో సైతం ఆయనకే టికెట్ అని పార్టీ ప్రకటించింది. సిట్టింగులు అందరికీ మళ్లీ టికెట్ ఇస్తున్నట్లుగా చంద్రబాబు చాలా కాలం క్రితమే చెప్పారు. దాంతో వెలగపూడిని మార్చి ఆ సీటు జనసేనకు ఇవ్వరని అంటున్నారు. దాంతో వంశీని ఎక్కడ నుంచి జనసేన పోటీ చేయిస్తుంది అన్న చర్చ మొదలైంది. జనసేనకు భీమునిపట్నం టికెట్ ని పొత్తులో భాగంగా కేటాయిస్తారు అని అంటున్నారు.
దాంతో ఆ హాట్ ఫేవరేట్ సీటు నుంచి వంశీని జనసేన బరిలోకి దింపుతుందని అంటున్నారు. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వంశీ భీమునిపట్నం నుంచి పోటీ చేస్తారు అని అంటున్నరు. భీమిలీలో కూడా యాదవ కులస్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో బీసీ అభ్యర్ధికి టికెట్ ఇచ్చామని జనసేన చెప్పుకునేందుకు వీలు కలుతుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ ఎమ్మెల్సీ వంశీ జనసేనకు చేరడం ద్వారా విశాఖ జిల్లా రాజకీయాల్లో కాక రేపారు అని అంటున్నారు.