Begin typing your search above and press return to search.

సినిమాల్లోకి వైసీపీ... అందుకోసమేనా ?

రాజ్యసభలో గురువారం వైసీపీ ఎంపీ సినిమాల గురించి చాలా సేపు మాట్లాడారు.

By:  Tupaki Desk   |   27 July 2023 4:00 PM GMT
సినిమాల్లోకి వైసీపీ...  అందుకోసమేనా  ?
X

రాజకీయం సినిమాలూ రెండూ తెలుగు తమిళ రాష్ట్రాల లో మిక్స్ అయిపోయి దశాబ్దాలు దాటుతోంది. ఎన్టీయార్ తెలుగు నాట సినిమాల నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అదే బాట లో అనేకమంది నటులు హీరోలు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లో దూకుడు చేస్తున్నారు.

ఆయన లేటెస్ట్ గా బ్రో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ సినిమాలు అయినా రాజకీయాలు అయినా అందరివీ అన్నారు. అవకాశాలు దక్కించుకుని ఏ సామాన్యుడు అయినా హీరో కావచ్చు, రాజకీయాల్లో రాణించనూ వచ్చు అని సంచలన కామెంట్స్ చేశారు.

అటు సినిమా ఇటు రాజకీయంతో పవన్ కళ్యాణ్ ఏపీ లో తనదైన శైలి లో జోరు చేస్తూంటే వైసీపీ కి కూడా సినిమా ఇంటరెస్ట్ పెరిగింది అని అంటున్నారు. రాజ్యసభలో గురువారం వైసీపీ ఎంపీ సినిమాల గురించి చాలా సేపు మాట్లాడారు. సినిమాటోగ్రఫీ చట్టం లో కీలకమైన మార్పులు చేయాల ని ఆయన కోరుతూ ఈ సందర్భంగా ఆసక్తిని రేకెత్తించే కామెంట్స్ చేశారు.

భారతీయ సినిమా లో హీరోలు అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారని, అందులో పనిచేసే మిగిలిన కేటగిరీల కు మాత్రం నామ మాత్రపు జీతాలు చెల్లిస్తున్నారని విమర్శలు చేశారు. బాలీవుడ్ లో ఒక్కో హీరో రెండు వందల రూపాయల దాకా రెమ్యూనరేషన్ రూపంలో తీసుకుంటున్నారని, వీరి వల్ల సినిమా బడ్జెట్ లో అత్యధిక భాగం రెమ్యునరేషన్ కే పోతోంది అని ఆయన అంటున్నారు.

ఈ ధోరణిని మార్చాలని సినీ కార్మికుల కు అనుగుణంగా చట్టాల లో మార్పులు చేయాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది దాకా సినీ కార్మికులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సినిమాల గురించి సడెన్ గా వైసీపీ ఎంపీ అందునా ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు చర్చకు తెర తీయడం దేని కోసం అని అంటున్నారు.

సినీ బడ్జెట్ పెరిగిపోతోంది అని అంతా అంటున్నారు. అయితే అందులో లోగుట్టు అందరికీ తెలిసిందే. హీరోల పారితోషికాలే అని అంతా విమర్శిస్తారు. ఇపుడు విజయసాయిరెడ్డి అలాంటి ఆరోపణలనే ఏకంగా పెద్దల సభ లో చేసి సినీ కార్మికల కు రక్షణగా చట్టం లో మార్పు చేయాలని కోరడం విశేషం.

అయితే సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఏ విధంగా మార్చాలన్న దాని మీద ఆయన సూచనలు ఏమి ఇచ్చారో తెలియడంలేదు. సినిమాలు అన్నవి వ్యక్తిగత వ్యాపారంగానే ఉంది. అది పెట్టుబడిని పెట్టుకుని ఎవరికి వారుగా సినిమాలు తీస్తున్నారు. అయితే దీని ని పరిశ్రమగా గుర్తించమని చాలా కాలంగా డిమాండ్ ఉంది.

మరి పరిశ్రమ కానపుడు సినీ కార్మికల కు చట్టాలు వర్తిస్తాయా అన్నది ఒక కీలక ప్రశ్న. వారికి కూడా కనీస వేతన చట్టమే వర్తిస్తుంది తప్ప ప్రత్యేకించి సినిమాటోగ్రఫీ శాఖ చట్టం చేయగలదా అన్నది కూడా సందేహంగా ఉంది. హీరోల భారీ పారితోషికాలు అంటే అదంతా ప్రచారంలోనే ఉంటుంది తప్ప వైట్ మనీగా బయటకు రాదు.

మరి అలాంటపుడు ఇచ్చేవారు ఉంటారు, పుచ్చుకునేవారు ఉంటారు. ఈ మధ్యలో చట్టాలు తెచ్చినా అవి ఎలా అమలు చేస్తారు అన్నది కూడా కీలకమైన ప్రశ్నగా ఉంది. ఇక విజయసాయిరెడ్డి తన ప్రసంగం లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రస్తావించారు. కానీ ఏపీ లో వైసీపీ ఉంది. అది ఒక సినీ హీరోతో రాజకీయ పోరాటం చేస్తోంది. మరి వైసీపీ సినిమా అందుకోసమేనా అన్నదే ఇపుడు అందరి మదిని దొలిచేస్తున్న ప్రశ్న.