వైసీపీ ఎంపీలు బీజేపీ బాట పడతారా? అవినాష్ సెంట్రిక్‌గా చర్చ!!
తాజా ఎన్నికల్లో వైసీపీకి నలుగురు ఎంపీలు మాత్రమే మిలిగారు. కడప, రాజంపేట, తిరుపతి, అరకు స్థానాలు మాత్రమే వైసీపీకు దక్కాయి
By: Tupaki Desk | 8 Jun 2024 3:15 AM GMTతాజా ఎన్నికల్లో వైసీపీకి నలుగురు ఎంపీలు మాత్రమే మిలిగారు. కడప, రాజంపేట, తిరుపతి, అరకు స్థానాలు మాత్రమే వైసీపీకు దక్కాయి. కడప, రాజంపేట స్థానాల నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిలు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక, తిరుపతి నుంచి వరుసగా రెండో సారి.. గురుమూర్తి విజయం దక్కించుకున్నారు. ఇక, తొలిసారి అరంగేట్రం చేసి, అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిని డాక్టర్ గుమ్మ తనూజా రాణి విజయం సాధించారు. వీరిలో తొలి ముగ్గురు కూడా.. వైసీపీ అధినేత జగన్‌కు వీర విధేయులు. జగన్ గీసిన గీత దాటరు. కానీ, తనూజా రాణి .. రాజకీయాలకు కొత్త. దీంతో ఆమె పరిస్థితి ఏంటనేది చూడాలి.
ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు వైసీపీ నుంచి గెలిచిన వారంతా.. కూడా.. వీర విధేయులే అయినా.. వారి వారి అవసరా ల రీత్యా వారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి పార్టీ మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ యనపై వివేకానందరెడ్డి హత్య కేసు ఉంది. దీంతో ఇప్పటి వరకు వైసీపీ అధికారంలో ఉండడంతో ఏదో ఒక రకంగా నెట్టుకొచ్చారు. కానీ, ఇప్పుడు వైసీపీ అధికారం పోయింది. దీంతో ఆయన తనను తాను రక్షించుకునేందుకు బీజేపీ బాటపట్టినా.. ఆశ్చర్యం లేదు. ఇదే విషయాన్ని గతంలో జగన్ చెప్పినట్టు వివేకా కుమార్తె సునీత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇక, రాజ్యసభకు వచ్చే సరికి 11 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో మోడీ కి బలం లేదు. పోనీ.. టీడీపీకైనా బలం ఉందా? అంటే.. రాజ్యసభలో లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. దీంతో రాజ్యసభలో మోడీకి బలం అవసరం. దీంతో ఆయన నేరు గా కాకపోయినా.. పరోక్షంగా అయినా.. వైసీపీ ఎంపీ ల మద్దతు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ విషయంలో గతంలో చంద్రబాబు అనుసరించినట్టుగానే.. జగన్ కూడా సైలెంట్ అయి... తన వారిని బీజేపీలోకి పంపించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ జాబితాలో విజయసాయిరెడ్డి వంటి వారు ముందున్నారు.
సాయిరెడ్డిపై కేసులు ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులు ఆయన కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తనను తాను రక్షించుకునేందుకు సాయిరెడ్డి బీజేపీ బాట పట్టే అవకాశం మెండుగా ఉంది. ఇది జగన్ సూచనలతో చేస్తారా? లేక.. స్వతంత్రం గానే నిర్ణయం తీసుకుంటారా? అనేది చూడాలి. ఏదేమైనా ఇలా.. అటు లోక్‌సభలోనూ.. ఇటు రాజ్యసభలోనూ.. మార్పులు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి జంప్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఏదో ఒక క్షణంలో ఆయన పార్టీ మారేందుకు రెడీ అవడం ఖాయమని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.