Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషం?

విశాఖ వైసీపీ ఎంపీకి చెందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషం ఉందన్న కారణంగా అక్కడి రోడ్డును మూసేశారని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 5:56 AM GMT
వైసీపీ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషం?
X

జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్య చేశారు. ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీపై ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. విశాఖ వైసీపీ ఎంపీకి చెందిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు వాస్తు దోషం ఉందన్న కారణంగా అక్కడి రోడ్డును మూసేశారని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రజలు నడిచే దారిని మూసేయటం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు.

విశాఖపట్నం మహానగరంలోని టైకూన్ జంక్షన్ లో వైసీపీ ఎంపీ ఒక భారీ భవంతిని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ భవంతికి వాస్తు దోషం ఉందన్న సూచనతో.. అక్కడి రోడ్డును మూసేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ జంక్షన్ వద్దకు చేరుకున్న జనసైనికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల మనోహర్ విశాఖ ఎంపీ తీరును తప్పుపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు.

దీనిపై జనసైనికులు తీవ్రఆగ్రహాన్నివ్యక్తం చేశారు. కారణం.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జనసైనికులను పోలీసులు అమానుషంగా రోడ్లపైన ఈడ్చుకెళుతూ అరెస్టు చేయటాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ వెంటనే స్పందించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన విశాఖ త్రీటౌన్ స్టేషన్ కు వెళ్లి అక్కడి పోలీసులతో మాట్లాడారు. రానున్న ప్రభుత్వంలో విశాఖ భూదందాపై సమగ్ర విచారణ చేపడతామని పేర్కొన్నారు.

శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళల్ని రోడ్ల మీద ఈడ్చిపడేయటం ఏమిటి? అని ప్రశ్నించారు. ఏం తప్పు చేశారని జనసేన నాయకుల్ని అరెస్టు చేశారో వివరణ ఇవ్వాలని కోరగా.. పై నుంచి వచ్చిన ఆదేశాలతో అలా చేశామని పోలీసులు చెప్పటంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో చోటు చేసుకున్న పరిణామాల్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.

వారాహి విజయయాత్రలో భాగంగా విశాఖకు వచ్చిన పవన్ కల్యాణ్.. టైకూ జంక్షన్ లో వివాదాస్పద సీఎన్ బీసీ మిషనరీ భూముల్లో విశాఖ వైసీపీ ఎంపీ నిర్మిస్తున్న పెద్ద భవంతిని.. ఆ భూముల్లో జరిగిన అవకతవకల్ని పరిశీలించారన్నారు. టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డుకు వెళ్లే మార్గాన్ని ఎంపీ నిర్మిస్తున్న భవనానికి రోడ్డు పోటు ఉందన్న కారణంగా మూసేశారన్నారు. విశాఖ ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ రోడ్డును మూసేయటం కారణంగా ప్రజలు ఫైఓవర్ వరకు వెళ్లి రావాల్సి వస్తుందన్నారు. రోడ్డును తెరిస్తే రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగ పోలీసులపై ఒత్తిడి తెచ్చిన పెద్ద మనిషి ఎవరన్న విషయాన్ని పోలీసులు తెలపాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ విశాఖలో రాజకీయ వేడిని పెంచిందని చెప్పాలి.