పల్నాడు హాట్.. కీలక నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఇతడేనా?
ఇక నరసరావుపేట ఎంపీగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డికి అవకాశం ఇస్తారని అంటున్నారు. మోదుగుల 2009లో తొలిసారి నరసరావుపేట ఎంపీగా టీడీపీ నుంచి గెలుపొందారు.
By: Tupaki Desk | 7 Jan 2024 9:04 AM GMTఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో నరసరావుపేట ఒకటి. అటు అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు పార్లమెంటు నియోజకవర్గంగానూ ఉంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాకు ఆయువుపట్టుగా ఉన్న నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా వైసీపీకి చెందిన విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈయన 2019 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఈసారి ఆయనను గుంటూరు లోక్ సభా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి నరసరావుపేట ఎంపీగా గెలిచిననాటి నుంచి శ్రీకృష్ణదేవరాయలకు, నియోజకవర్గ పరిధిలో తన పార్టీకే చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినికి, లావుకు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పలుమార్లు వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకుని సర్దిచెప్పాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నరసరావుపేట ఎంపీగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డికి అవకాశం ఇస్తారని అంటున్నారు. మోదుగుల 2009లో తొలిసారి నరసరావుపేట ఎంపీగా టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని బాలశౌరిపై కేవలం 1607 ఓట్ల తేడాతో మోదుగుల విజయం సాధించారు.
ఇక 2014లో మోదుగుల వేణుగోపాలరెడ్డి టీడీపీ తరఫున గుంటూరు పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల ముందు మోదుగుల వైసీపీలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాలరెడ్డిని నరసరావుపేట స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తాజాగా మోదుగులను తాడేపల్లికి పిలిపించుకున్న జగన్ తన మనసులోని మాటను ఆయనకు వివరించినట్టు సమాచారం.
నరసరావుపేట ప్రస్తుత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు వైసీపీ నేతలతోనే విబేధాలున్న నేపథ్యంలో ఆయనను గుంటూరుకు మార్చాలని జగన్ నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట నుంచి గతంలో ఎంపీగా గెలిచిన మోదుగులకు సీటు ఇస్తారని టాక్ నడుస్తోంది.