Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలుగా ఇద్దరు మహిళా ఎంపీలు..... వైసీపీ ప్లాన్ అదిరిందిగా...!?

మరి కొందరిని పూర్తిగా పక్కన పెడుతోంది. ఇక అనకాపల్లి జిల్లా అల్లూరి జిల్లాల నుంచి ఇద్దరు మహిళా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 3:00 AM GMT
ఎమ్మెల్యేలుగా ఇద్దరు మహిళా ఎంపీలు..... వైసీపీ  ప్లాన్ అదిరిందిగా...!?
X

వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ వైసీపీ తొడగొట్టి మరీ బరిలోకి దిగుతోంది. ఈసారి గతంలో వచ్చిన 24 సీట్ల కొరత కూడా లేకుండా టోటల్ గా ఏపీనే క్లీన్ స్వీప్ చేస్తామని అంటోంది. ఆ దిశగా వైసీపీ అధినాయకత్వం భారీ కసరత్తు చేసుకుంటూ ముందుకు పోతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దించుతోంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేను ఎంపీలుగా పంపుతోంది.

మరి కొందరిని పూర్తిగా పక్కన పెడుతోంది. ఇక అనకాపల్లి జిల్లా అల్లూరి జిల్లాల నుంచి ఇద్దరు మహిళా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది. త్వరలో విడుదల అయ్యే వైసీపీ రెండవ జాబితాలో ఈ ఇద్దరు ఎంపీల పేర్లు ఉంటాయని అంటున్నారు.

అనకాపల్లి నుంచి 2019లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన భీశెట్టి సత్యవతిని ఈసారి అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం చూస్తోంది. ఆమె బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన వారు. విద్యాధికురాలు. వైద్య వృత్తిలో దశాబ్దాలుగా ఉన్నారు. పైగా స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఎంపీగా ఆమె పనితీరు పట్ల కూడా ఎలాంటి విమర్శలు లేవు.

దాంతో ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని పార్టీ కీలకమైన నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అనకాపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఆయన్ని చోడవరం నుంచి ఈసారి పోటీ చేయిస్తారు అని అంటున్నారు. దాంతో అనకాపల్లి సీటుకు ఎంపీ సత్యవతిని సిద్ధం చేశారు అని అంటున్నారు.

టీడీపీలో ఇదే సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీల మధ్య వర్గ పోరు సాగుతోంది. ఇంకో వైపు జనసేన కూడా ఇదే సీటు కోరుకుంటోంది. దాంతో ఎంపీని ఇక్కడ దింపితే నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న గవర సామాజికవర్గంతో పాటు కాపుల మద్దతు కూడా దక్కుతుందని అంటున్నారు. మంత్రి గుడివాడ సైతం ఆమె అభ్యర్ధిత్వం పట్ల సుముఖంగా ఉండడంతో ఆయన వర్గమంతా ఆమెకు పనిచేస్తారు అని అంటున్నారు.

ఇక అల్లూరి జిల్లా అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని పాడేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. మాధవి ఎంపీగా రెండున్నర లక్షల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ఆమె కూడా మంచి పనితీరు కనబరచారు. అయితే ఈసారి ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అధినాయకత్వం నిర్ణయించింది అని అంటున్నారు. పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి పనితీరు పట్ల సర్వే నివేదికలు వ్యతిరేకంగా రావడంతో పాటు వైసీపీలో గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన గిడ్డి ఈశ్వరి నుంచి గట్టి సవాల్ ఎదురవౌతోంది.

దాంతో ఈసారి గొడ్డేటి మాధవిని పోటీలోకి దించడం ద్వారా పాడేరు అసెంబ్లీ సీటుని మరోసారి తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక భాగ్యలక్ష్మికి టికెట్ దక్కదనే అంటున్నారు. అరకు ఎంపీ సీటుని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరకు ఇస్తారని తెలుస్తొంది. ఈ సమీకరణలతో భాగ్యలక్ష్మిని ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చి పక్కన పెడతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఇద్దరు మహిళా ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీలోకి దించబోతున్నారు అన్నది వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది.